Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు కథాసాహిత్య ప్రపంచాన బుర్రా లక్ష్మీ నారాయణది విలక్షణ కంఠస్వరం. కథ రాయడంలో వారి శైలి పూర్తిగా కొత్తది. వాస్తవికత, భావుకత, ఊహాశాలిత కలగలసి కథకు కొత్త అందాల్ని సమకూర్చిన శైలి వారిది. ఇతివృత్తం లోపలిపొరల్లో దాగుండిపోయి కళాత్మకమైన వ్యక్తీకరణగా రూపు దాల్చిన వారి కథనరీతి ప్రత్యేక ఆకర్షణ. వస్తువు ఏదయినా సమ్మోహితుల్ని చేసే శిల్ప సంవిధానంతో వ్యక్తం కావడం గొప్ప సుగుణం. ఇప్పటివరకు వారి మూడు కథల సంపుటాలు - కలచాలనమ్, నాలుగు పుంజీలు, మట్టి అరుగు వచ్చాయి. ఇపుడు 'దేహనది' కథల సంపుటి వారి నాలుగో పుస్తకం. 'దేహనది' అనే కవితాత్మకమైన ఈ శీర్షిక చదవగానే చిత్రమైన అనుభూతికి లోన వుతారు పాఠకులు. దేహాన్ని నదితో ఉపమించిన వారి ఊహాశాలితని మెచ్చకుండా ఉండలేం. ప్రత్యేకంగా కవిత్వం కూడా రాశారు. 'ఇదీ వరస', 'సెంద్రి తలుపులు' అనే పుస్తకాలు వెలువరించారు.
కథాకథనంలో కొన్నిచోట్ల కవితాత్మకమైన శైలి దర్శనమిస్తుంది. ఈ కథల సంపుటిలో పద్దెనిమిది కథలున్నాయి. భిన్నమైన ఇతివృత్తాలతో రూపొందిన ఈ సంపుటంలో ప్రతి కథా ప్రత్యేకమైన రీతిలో రూపు గట్టించారు. లక్ష్మీనారాయణ కథల్లోని పాత్రలు మామూలు మనుషులే. మధ్యతరగతి కుటుంబాల్లోని సంఘర్షణలు, సంక్లిష్ట తలతో సతమతమయ్యే వారే. గెలుపు ఓటముల విచికిత్సతో తల్లడిల్లేవారే. అయినప్పటికీ జీవితాన్ని పరికించే దృష్టికోణం పాఠకుల్ని ఆలోచింప జేస్తుంది. మానవ స్వభావంలోని వైరుధ్యాలని అవగాహన చేసుకునే క్రమాన్ని చిత్రించిన విధం భిన్నమైన ఆలోచనలకు పురిగొల్పుతుంది. మనకు తెలియకుండానే కథల్లోని పాత్రలు, సంభాషణలు ఏదో సందర్భంలో స్ఫురణకొస్తాయి. మనం మరచిన జ్ఞాపకాల్లోకి తలుపులు తెరుస్తాయి. మన లోపల మనకే తెలియని ప్రపంచాలు ఉన్నాయన్న స్పృహని కల్పిస్తాయి. అచేతనలోంచి చేతనలోకి వచ్చేందుకు తండ్లాడే చైతన్యాన్ని ప్రోది చేస్తాయి. మన లోపలి అలజడిని మనకు పరిచయం చేస్తాయి. కోల్పోయిందేమిటో, కాపాడుకోవాల్సిందే మిటో చెప్పకనే చెబుతాయి. కథా రచన సాధించాల్సిన ప్రయోజనం ఇంతకన్నా మరేదీ ఉండబోదన్న ఈ కథలు చదివితే బోధపడుతుంది. వాస్తవాన్ని, మానవ స్వభావాన్ని కళాత్మకంగా, పఠిత మనసుని ఆర్ద్రం చేసేలా రాయడం ఈ రచయిత ప్రత్యేకత. అందుకే ఒక సమస్య- దాని పరిష్కారం అనే పరిధిలో ఉండవు ఈ కథలు. మనకు తెలిసినట్టే ఉండి తెలియని మనుషుల అంతరంగాల్లోని తపనల్ని, ఘర్షణల్ని పట్టి చూపడం ఈ రచయిత అనుసరించిన పద్ధతి. అందువల్లనే సౌందర్యభరితమూ, సారవంత మూ అయిన ఈ కథలు చదవడం పాఠకుల సమయాన్ని వెలిగిస్తుంది.
- కిరణ్కుమార్