Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక్కడ, ఓ నా హృదయమా,
మనం కాల్చేద్దాం
ఆ ప్రియమైన కలల్ని
అవి చనిపోయినయి గదా-
ఇక్కడ ఈ కట్టెల్లో జరిగే అంత్యక్రియల తంతును
మనం అనుభవిద్దాం
పడుతున్న తెల్లని
పూ దళాలు, ఆకులు
అవి మృదువుగా, ఎరుపుగా-
ఇక్కడ మనం కాల్చేద్దాం
జ్వలించే మధ్యాహ్నంలో
దివిటీ మంటలా-
మనం అలసిపోయినం,
నా హృదయమా,
మనం అలసిపోయినం,
చాలా కాలమే అయింది
మనం పుట్టి-
అతిగా ప్రేమించినం,
భారమైన కలల్ని,
అవి చనిపోయినయి గదా
ఇక మనం విశ్రమిద్దాం
మనం దూరంగా వెదజల్లుదాం
వాటి బూడిదని,
ఒకింత సేపు మనం దు:ఖపడదాం
మనం విశ్రమిద్దాం,
ఓ నా హృదయమా,
పడమర దిశన గోధుమ రంగు నీడలు మొలిచే వరకు-
కానీ, తప్పక మనం తొందరంగా మేల్కొనాలి,
ఓ నా హృదయమా, తిరిగి పునర్జీవనోత్సవం పొందాలి
ప్రపంచ యుద్ధ రంగంలోకి,
కిక్కిరిసిన జన పర్వంలోకి వెళ్లాలి
మనం మేల్కొనాలి, ఓ నా హృదయమా,
తిరిగి ఆ కలల్ని పోగు చేయాలి
మనం ఘర్షిద్దాం విషాదమయ జీవితాన్ని
విషాదకర పాటతో-
- ఆంగ్లమూలం:
'ఇన్ ద ఫారెస్ట్' - సరోజిని నాయుడు
స్వేచ్ఛానువాదం: - దాసరాజు రామారావు