Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అత్యాధునికంగా వచ్చిన మినీ కవితా ప్రక్రియలలో ఫెంటో (FEMTO) ఒక విభిన్న ప్రక్రియ. ఈ ప్రక్రియకి ఆద్యులు ''అరుణ్ రాజం'' ఇది రెండు పంక్తుల రచన. ఇవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రాముఖ్యం పొందింది. రాఖీ రచించిన ''లబ్-డబ్'' ఫెంటోల సంపుటిలో రెండు పంక్తులలో ఎన్నో భావాలని పలికించారు. అనుభూతిని చిన్న వాక్యాలలో వ్యక్తీకరించడం వీటి ప్రత్యేకత. ప్రథమ పాదంలో పది అక్షరాలుగాను, ద్వితీయ పాదంలో పదిహేను అక్షరాల నియమంతో సాగుతాయి. కేవలం భావ ప్రధానమే కాకుండా సామాజికం కూడా చూడొచ్చు. చిన్నపిల్లలపై అత్యాచారాన్ని నిరసిస్తూ 'నిత్యకృత్యాలు అకృత్యాలు / చిన్నారులపై అత్యాచార పైశాచికత్వాలు' అందరం ఖండించాల్సిన అవసరాన్ని చాటి చెప్తారు. అలాగే దేశానికి వెన్నుముక అయిన రైతు గురించి మరో ఫెంటోలో ఇలా 'కోరుకుంటే నేరమేమి/మిద్దెల మేడలా, కాస్త మద్దతు ధరనే కదా...' 'ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు కష్టపడి పండించిన దానికి మద్దతు ధరనే కోరుకునేది' అని రైతుకు మద్దతు పలుకుతారు.
'ఆకలిని చంపండి
ఆకలికేకలేసే దొంగని కాదు' దొంగతనం చేసేవాడిని కాదు అలాంటి పరిస్థితిని తరిమి కొట్టండి, ఉపాధి చూపండి అంటారు. 'ఒక్క జన్మ సరిపోదు / స్త్రీ సౌందర్యారాధనలో ఆస్వాదనలో' అవును అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ఒక జీవితకాలం అయినా సరిపోదు మరి. అక్షరం ఆయుధమైతే ఎంతవరకైనా పోరాడవచ్చు అది రాజ్యమైనా లేదు, అంతర్లోకాలనైనా.. అందుకే కాబోలు ఇలా
'అక్షరం ఆయుధం అనాదిగా
గుండెలోతుల్లో దింపేందుకు నింపాదిగా' నిజమే కదా అనాది కాలం నుంచి అక్షరాన్ని ఆయుధంగా చేసి ఎన్ని పోరాటాలకు తెరతీయలేదు. మనిషిని చింత కాల్చేస్తుంది కడవరకు ఏదో ఒక చింత దహిస్తూనే ఉంటుంది కదా అలాంటి చింతనే నేస్తమా? అవుననే అంటారు. /వేదనే నేస్తం మనిషికి /పుట్టుక నుంచి పుడకల దాకా/ అలాగే జీవితంలో అనుభవాలకు మించిన గురువు ఎవరు ఉంటారు. ఎవరి అనుభవాలు వారికి పాఠాలు కదా...
'అనుభవాలే గుణపాఠాలు ..
జీవిత పాఠశాలలో' అవును మంచి అయినా చేడు అయినా ప్రతి క్షణం నేర్చుకోతగినవే.
ఇంకా ఈ సంపుటిలో ఎన్నో అందమైన ఫెంటోలు ఉన్నాయి.. 'లబ్ డబ్'లోని చాలా ఫెంటోలు జీవిత సారాన్ని వడపోసి అక్షరీకరించారు రాఖీ. ద్విపద కవిత ప్రక్రియ పాతదే అయినా కొత్త ఒరవడితో ఫెంటో అనే కొత్త రూపంలో ముందుకు తీసుకువచ్చి అందరికి అర్థం అయ్యేలా రాయడంలో రాఖీ విజయం సాధించారు. కళాత్మకత, సృజనాత్మకత భావుకత ఫెంటోలకి అవసరం. రాఖి ఫెంటోలలో అవన్నీ ఉన్నాయని చెప్పవచ్చు. మినీ కవిత ప్రక్రియలో ఫెంటోల సంపుటిలు మరిన్ని రావాలి. తోలి ప్రయత్నంగా రాఖీ ముందడుగు వేశారు. ఇలానే కొనసాగాలని ఆశిద్దాం.
-పుష్యమీ సాగర్,
9010350317