Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూపం మారలేదుగానీ రంగులు మార్చేసాయి
తెల్లతోలు కప్పుకుని
వసంతకాలంలోకి హంసలై వాలుతున్నారు
వింత గొంతుక చిత్రమైన అరుపులు
రెండుమూడు రంగులమిళితవర్ణాల్లా
తేటగా నవ్వుతూ
కోకిలలై పాడుతున్నట్టు భ్రమలో వాటికవే!
కోటల ఆర్కిటెక్చర్ అందాలు
విగ్రహాల వింతావిష్కరణలు
అడవుల అలంకరణలూ నదుల అనుసంధానాలు
తారురోడ్ల నయగారాలు ఫ్లైఓవర్ల పాతముచ్చట్లు
గరీబ్ రథ్ల గల్లీపాటలు ఒక్కటనేముంది
గద్దెగద్దెకూ క్షిపణీ ప్రయోగాలు
PSLV రాకెట్ల ఎగురవేతలు
అవి దాహానికి రాళ్ళు పోగేయడం లేదు
సముద్రానికి చిల్లిపొడుస్తున్నాయి
చిగురు తొడిగిన వసంతకాలానికి
వెన్నెలమల్లెలు పూయాలిప్పుడు
ఈ ముదురు ముళ్ళతీగల
మూలబడేసే పథకాలెందుకు
మూకుమ్మడి అభివృద్ది కావాలిప్పుడు
ఈ పొల్యూటెడ్ పోకడలెందుకు
పోగుచేయబడిన విశ్వాసం ఉండాలిగానీ
ఒంటికొమ్మ చిగురింతలెందుకు
ఫలాలిచ్చే వసంతం నిండాలి తప్ప
ఇప్పుడు చెట్టంతా మసకబారి
ఒక్కకొమ్మే విరగబూస్తుంది
భూమిసారమేం తగ్గలేదు స్వార్థం!
చెట్టు మనిషికి ఆదర్శం
ఇప్పుడు మనిషి చెట్టుకు ఆదర్శమయ్యాడు
హంసలు కూడా కాకులౌతున్న ప్రమాద హెచ్చరిక!
మెతుకు మరిచి, బతుకు మరిచి సహజత్వం విడిచి
డబ్బును తాగేస్తున్నారిప్పుడు
మనుషులు విగ్రహమౌతున్నారిప్పుడు
వింతగా జీవిస్తున్నారిప్పుడు!!
- అరుణ నారదభట్ల,
9705015207