Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రి ఊడలాంటి ఒక వాక్యాన్ని పట్టుకుని
నేను గాలిలో రెక్కల పక్షిలా తేలుతూ
మధ్య మధ్యలో నేల మీద మనిషిలా
వాలుతూ బయలుదేరాను
నాలోంచి లోయలూ మైదానాలూ
ఎడారులూ ఎత్తయిన పర్వతాలూ
అనేక జనసమూహాలూ
నదుల్లా ప్రవహిస్తూ వెళుతున్నాయి
నన్ను చూసిన వాళ్ళు
నన్నొక వాక్యంగానో పదంగానో
విడదీయలేని ఒక భావనా చైతన్యంగానో
పరిగణించాలనుకుంటాను
నిజంగా నేను చాలా నగంగా ఊరేగుతున్నాను
నా రెక్కల్లోని ఈకల్లా
వాక్యాలు గాలిని రాసుకుంటూ
ఒక పరిమళాన్ని వెదజల్లుతూ వ్యాపిస్తున్నాయి
అయితే నన్నొక కులంగానో
మతంగానో ప్రాంతంగానో
ఒక సమూహంలో సభ్యునిగానో తప్ప
మనిషిగా గుర్తించే వారికోసమే
మర్రి ఊడలాంటి వాక్యాన్ని పట్టుకుని
మళ్లీ గాలిలో తేలుతూ
రాలిన ఈకలా నేల మీద వాలుతూ నేను
అవును ఎవరో అచ్చం నాలాగే
నగంగా వున్న కొన్ని చేతులతో
వానవిల్లును రాసుకుంటూ
రాలిపడుతున్న ఈకను
దోసిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు
బహుశా వాక్యాలను మరికొన్ని వాక్యాలే
నగంగా పెనవేసుకుంటాయనుకుంటా
అయితే వాక్యాలను అల్లుకుపోయే
పందిరిలాంటి మనుషులు కూడా!
- చిత్తలూరి, 9133832246