Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక స్వప్న పద్మవ్యూహం నుండి
వొళ్ళు విరుచుకున్న పిపీలికం పృథ్వి
రసాయనాల సంగమాల నిశీథిలో
మాయలాంతరు సృష్టించిన మనిషి
భువనాంతరాళంలోని కళాత్మక నగిషి
ఒక శిల్పాన్ని ఇంత సుందరంగా చెక్కటం
కాలానికి మాత్రమే తెలిసిన పరుసవేది
మట్టినుండి, గాలినుండి, నిప్పు నింగీ నీటి నుండి
చిటికెడు చిటికెడుగా కలగాపులగం చేసి
మరులతో నిలబెట్టిన ప్రాణ పంచకం
ఈ పంచ ప్రాణాలు వినా భూమి సైతం శూన్యమే
మన్నుతిన్న కన్నయ్య నోట్లో పోతన్న దర్శించిన
పదునాలుగింటిలో తిరిగిన ఒకానొక బొంగరం
నేటికీ అక్షరాలా ఆంతర్యం అలానే వున్నా
బాహ్యం మాత్రం కకావికలం....
నశించిన మహా వృక్షాల పరంపరలో
పాల పుంతలో గృహ సముదాయంగా పరిభ్రమిస్తూ
ఒక్కో ప్రాణాన్ని క్రమశ కోల్పోతూ
వృద్ధ కపోతంలా మిగిలి వుంది
వసంత వీధుల్లో తారాడిన జీవ వైవిధ్యం
స్వార్ధ విధ్వంస వాతావరణంలో
కాలుష్య కల్లోల కడలికి హేతువైంది
గ్రహాల ఆగ్రహ జ్వాలల్లో ధ్వంసమై
నల్ల బావులుగా మిగిలిపోతున్న విశ్వంలో
కర్బన వాయువులు పీలుస్తున్న ఈ పిపీలికమెంత..?
దీని జీవన ధైర్ఘ్య మెంత...?
ఈ విపులకి ఆయువురేఖ తరిగి పోతుంది
కోతి నుండి కొండంత ఎదిగిన మనిషి
కొండలనే దిగమింగుతూ, నదుల్ని మరుగు పరుస్తూ
సమస్తాన్ని అతలాకుతలం చేస్తున్నాడు
మృత్యు గహ్వరంలోకి జారిపోతూ
పుడమిని పట్టుకు వేలాడుతున్నాడు
తనతో పాటూ పృథ్వి ఆయువూ మింగేస్తున్నాడు..!!
- డాక్టర్ పెరుగు రామకృష్ణ,
9849230443