Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామూహిక బాధ
మనుషుల్ని ఒక్క చోటికి చేరుస్తుంది
బాధకు గురైన జనం
ఒక్కరొక్కరు గుమికూడి
బాధల పాటల పల్లవిని
సమిష్టిగా కోరస్గా ఎత్తుకుంటారు
ఒకరి దు:ఖాగ్ని మరొకరికి
అంటుకుని దావానంలా
పెనుమంటల్తో భావోద్వేగాల్ని
ఎగదోస్తుంది బీభత్సం సృష్టిస్తోంది
నిర్లక్ష్యం అజాగ్రత్త నిరంకుశత్వం
ఎవర్నీ లెక్కజేయని మనస్తత్వం
బాధ్యతల్ని గుర్తించనివ్వదు
జనం బాధలకు
బాధ్యత వహించుకోనివ్వదు
విలువైన ప్రాణాలు
గాలిలో కలిసిపోయాక
వేసిన దర్యాప్తు కమిటీల
చిత్తశుద్దిలేని నివేదికలు
ఏపాటి ఓదార్పునివ్వగలవు
ఎగసిపడే బాధాగ్ని జ్వాలల్ని
ఏమని జోగట్టగలవు?
ఏమని నిద్రపుచ్చగలవు?
చరిత్ర పురిటి నొప్పుల ద్వారా
తను ఆకాంక్షించే నవతరాన్ని కనకమానదు
సామూహిక చింతన తపన
సానబెట్టి పదునుబెట్టిన
లక్ష్యసాధన పూనిక
జెండాయై రెపరెపలాడుతూ
ముందు దారి చూపకమానదు.
- డా||దామెర రాములు