Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నాలో సంగమించకపోతే
నీ ఉనికికి అర్ధమే లేదు''
అంది గర్వంగా సముద్రం
''నదంటే కడలిలో
తప్పక కలవాలనే
సూత్రమేమీ లేదుగా''
అంది నది
''మాటకు మాట బదులిస్తున్నావని
కోపంగా విరుచుకుపడింది''
సముద్రం
''నేనూ తగ్గనంటూ''
ఆత్మగౌరవపు కిరీటాన్ని సవరించుకుంటూ
అన్నది నది
''ఒంటరిగమనంలో ఎన్నో మురుక్కాలవలు
నిన్ను మలినం చేస్తాయి''
అని బెదిరించింది సముద్రం
''నేను మలినపడడం అనే
మాటనే నిషేధిస్తున్నాను.
నీ లోపలకు ఒకమారు
తొంగి చూసుకో
ఎంత మురికి పోగుపడి ఉందో
నన్ను నేను ఎలా రక్షించుకోవాలో
నాకు బాగా తెలుసు'' అని
ఆత్మవిశ్వాసంతో స్థిరంగా బదులిచ్చింది నది
సముద్రం ఉన్నచోట
కెరటాలతో గర్జిస్తూ ఎగిరెగిరిపడుతోంది
నది తన దారిని వెతుక్కుని
ప్రశాంతంగా ప్రవహిస్తూ
తన అస్తిత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూనే ఉంది
- పద్మావతి రాంభక్త