Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకా తెల్లారనే లేదు
నల్లటిరేణువులు చీకటిగా చిక్కబడి
రాత్రంతా కలల్ని నిద్రలోకి రాయబారులుగా పంపి
జీవనబీభత్స మదింపు సూత్రమేదో రాబట్టాక కూడా
ఇంకా అలసట తీరనేలేదు, ఆరాటం తగ్గనేలేదు, ఆత్మ నిండనేలేదు
అక్కడక్కడా కలలు కొన్ని నిద్రలోనే ఉండిపోయి
వెనక్కి రాలేక, అక్కడే ఉండలేక గాలిలో తేలుతూ
కలవరింతల నిద్రలుగా, చిత్రమైన మాటల యంత్రరూపాలుగా మారిపోయాక కూడా
ఇంకా తెల్లారనే లేదు.
1
ఊరి గోడలపక్కన వొంటరిగా నడుస్తూ
పిల్లలకోసం మోకాళ్ళ నొప్పులమధ్య దారుల్ని ఎదురుచూపుల మార్గాలుగా మార్చుకుని
విశ్రమించలేని కళ్ళతో రోజులు చీకటికేంద్రాలుగా మారుతున్నా
ఏమీ చేయలేక, ఏమీ మార్చలేక అశక్తంగా మారిన
అమ్మానాన్నల బతుకుల్లోంచి తొంగిచూస్తూ
ఇంకా తెల్లారనే లేదు.
అంతటా నిశ్శబ్దం అలుముకున్నాక
సర్దుబాట్లు, అప్పగింతలూ అయ్యాక
చిత్ర విచిత్ర ప్రకటనల ముఖాల్తో ఏవేవో ఆకారాలు
అటూఇటూ కదులుతుంటాయి, ఎన్నిసార్లు అదిలించినా అవి కళ్ల ముందునుంచి కదలవు.
పైగా ఊహల్ని చరిత్రగా నమ్మమని ఆదేశాలు జారీ చేస్తుంటాయి.
విసురుగా వీచేగాలి కొన్ని ఎండిన ఆకుల్ని
పరిసరాల్లోకి విసిరిపోయాక ఎప్పట్లాగే
కమ్ముకునే చీకటి.
ఆ చీకట్ల పొడిగింపులో ఇంకా తెల్లారనే లేదు !
2
పొడిరోజుల్లో పొగచూరిన జీవితాల్లో
అధికారపు బదలాయింపులో
ఇంకా అలానే మిగిలిన నల్లటిరేణువుల చీకటి.
సరిహద్దుల కంచెల్లో, నిరుద్యోగి కళ్ళల్లో గాయపడిన పిట్టరెక్కలాంటి, భయపెట్టే నిశ్శబ్దంలాంటి చీకటి.
సిరియా బాల శరణార్థి ఐలన్ కుర్దీని
అలలపై మోసుకువచ్చే చీకటి.
రొహింగ్య కళ్లపై ఎండిన చూపులాంటి చీకటి.
కాలంలోంచి కాలంలోకి వొత్తిగిలే చీకటి.
వెలుగును లోపలికి జొరబడనీయని చీకటి.
ఇక ఎప్పటికీ తెల్లారనే తెల్లారదా !?
- యాకూబ్,
9849156588