Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండ మంటకు
మండిపోయి మాడిపోయి
బతుకంతా గుండెను డ్రిల్లింగ్ పట్టి
బొట్లుబొట్లుగా జీవితాన్ని ధారపోస్తూ
మన గుండెల్ని తాటి ముంజెల్ని చేస్తది
ఇంటికి తేమపూత పూస్తది
దాని ఛాతి ముందు
తలకాయలతో పిల్లల యుద్ధం
మొదలై ముదిరిపోతది
జాగ దొరకని ముసలమ్మ
చిల్లుల విసనకర్రతో
తాపాన్ని తుడిచేసుకుంటది
ముందు మూడునెల్లే
నీటిచక్రంలా తిరిగి తిరిగి
అలసిపోయి సందులో
కునుకు తీసేది.
గర్మికాలం కోసం కలల్ని పొదిగేది.
ఇప్పుడు ఆరునెలలు ఎండగా
దాని డిమాండే దండిగా
ఏలెడెత్తు పిల్లలు రిపేరు కోసం
సైకిళ్ళ గుర్రాలపై గల్లిగల్లీ తిరుగుతరు
ఆ సీజన్‌కు వాళ్ళే మీసం లేని నవాబులు
వాళ్ళ చేతిలో ఇసిరెల్ని చూసి కూలర్లు
ఒంటికాలిపై తొంగి చూస్తెయి.
పాత ముఖాలతో కొత్తగా నవ్వుతయి.
దాని పక్కటెముకలు
ముక్కూమూతి అతికిస్తే
పౌరుషంగా పంకలాడిస్తది.
కరెంటు రానప్పుడు లేనప్పుడు
అదే ముందు బెంగముఖంతో
ఎదురు చూస్తది.
- డా||ఉదారి నారాయణ,
9441413666