Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ కీచకుల్లారా!
అడవులను తుడిచేయకండి
నేలతల్లి వలువలను లాగేయకండి
చెట్లంటే ఏమనుకున్నారు
ఎన్నెన్నో మాహాప్రళయాలను నిలువరించే
మహాస్త్రాలు అవి
భూమిలోతుల్లోంచి స్వేచ్ఛగా
ఉదయించే మహాకావ్యాలు
తరతరాల గాలితరగలను
మన నరనరాన ప్రవహింపజేసే
సజీవ జన్యువులు అవి
మీరు ఓ కొమ్మను నరుకుతున్నప్పుడల్లా
ఎక్కడో ఓ ఊపిరితిత్తి
ఆత్మహత్య చేసుకుంటుంది
గూడు చెదరిన పక్షి ఆక్రందన
సముద్రఘోషై భూమి అంచుల్ని తాకుతుంది
తనను అక్కున చేర్చుకునే దిక్కులేక
సూర్యుడు ప్రతాపరుద్రుడౌతాడు.
అందుకే చెబుతున్నా
చెట్లను బిడ్డల్లా, మీ ఎద నీడల్లో ఎదగనీయండి
అవి మిమ్మల్ని తల్లుల్లా కడుపులో దాచుకుంటాయి
వాటిని తమకందినంత దూరం
తమ బాహువులు సాచి
స్వేచ్ఛగా గుండెల నిండా గాలి పీల్చనీయండి
భావితరాలకు ఊపిరిని వాగ్దానం చేయండి.
- డా||బి.బాలకృష్ణ,
9948997983