Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలో నేను మాట్లాడుకుంటాను
స్వగతమూ కాదు సంవాదమూ కాదు
గాలి ప్రపంచంతో మాట్లాడినట్టు
పూవు ప్రపంచం కోసం పూచినట్టు
నాతో నేను మాట్లాడుకుంటాను.
పుడమి వెతలన్నీ చెప్పుకుంటాను
ఎవరికీ యేదీ పట్టనప్పుడు
వొకరు మరొకరిని విన్పించుకోనప్పుడు
మనుషుల మధ్య దూరాలని అధిగమించాలని
మనిషితనం పరిమళించాలని
నాతో నేను మాట్లాడుకుంటాను
కన్నీటి వెతలు పంచుకుంటాను
వాళ్ళకేం వాళ్ళు మారాజులు
స్వార్థం తూచుకొనే తరాజులు
వాళ్లకి వాళ్ళతోడిదే లోకం
వాళ్ళ ఇల్లే వాళ్ళకో స్వర్గం
నరకాన్ని పట్టించుకోని వాళ్ళు
ఇళ్ళ చుట్టూ నిలువెత్తు గోడలు కట్టుకొన్న వాళ్ళు
అపశకునాలు ఇంట్లో ప్రవేశించకుండా
ఆల్సేషన్ శునకాలు పెంచుకొన్న వాళ్ళు
పరాయి స్వరం యేదీ విన్పించకుండా
చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకున్న వాళ్ళు
దగ్గర దూరాలని తగ్గించాలని
మనసుకు వొంటరితనం అంటరాకుండా
నాతో నేను మాట్లాడుకుంటాను
గుండె గాయం విప్పుకుంటాను
పడమటి ఆకాశంలో ఎగిరివెళ్ళిన పక్షులు
వొంటరి గూట్లో ముదుసలి పావురాళ్ళు
బతుక్కి దూరంగా చావుకి దగ్గరగా
మాటలు మరచిన మౌన హృదయాలు
కళ్ళల్లో వత్తులతో నిరీక్షిస్తూ
పలకరింపుల పండుగలు లేని వేళ
ప్రపంచ కుగ్రామ జాతరలో
తనను తాను వెతుక్కుంటున్న జనాభా
ప్రలోభాల మాయలో పడి
ఎక్కిన గుర్రం దిగని వాడితో
బంధం తెగిన మమతల ఖజానా
ఎటు చూస్తే అటు శూన్యం దైన్యం
అడుగేస్తే అంతా శూన్యం
ఎవడికి వాడొక రాజై యెదిగి
ఎవడి జెండా వాడే మోసుకొంటూ
వొంగి వొంగి తనకు తానే దణ్ణం పెట్టుకుంటూ
ఏకాకి తిరంగాలై ఎగురుతున్న వేళ
రుతు సంక్రమణం తప్పదని
మళ్ళీ మళ్ళీ వసంతం రాక తప్పదని
నాతో నేను మాట్లాడుకుంటాను
ఆత్మను విశ్వవ్యాప్తం చేస్తుంటాను.
- ఈతకోట సుబ్బారావు,
8008562742