Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లింకులు తెగుతుంటాయి
అతికించడమే కర్తవ్యం.
ఖాళీలు ఏర్పడతాయి
నింపుకుంటూపోవడమే భావ్యం.
పరిమళాలను అడుగుదాం
గతంలోంచి
వర్తమానంలోకి
అలముకుంటాయేమో చూడాలి.
వెలవెలబొయే
తారలకేమీ తెలియదు
రాత్రంతా ఒక
విషాదవీణగా మారిపోతుంది.
ఎడబాటు
ఒక బలమైన వేటుగా మిగుల్తుంది.
గాయాలు ఎవరివైనా కావచ్చు
మానడం ముఖ్యం.
నెలరోజులుగా
వికృతిగా మారిన ఆకాశం
అపూర్వ ప్రకాశమౌతుంది.
బిడ్డల్లారా!
మీ చిరునవ్వులు మీకే కాదు
ఇతరులకూ విలువైనవే.
బంగారుకొండలూ!
ఇటుచూడండి కాస్త
మీ కోసం
ఈ అక్షరాల గుల్దస్తా.
- డా|| ఎన్. గోపి