Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకంటే నన్ను విచారించే న్యాయాధికారి ఎవరు?
నా ఎదటి కంటే నేను ముద్దాయి ఎక్కడీ
పంచ భూతాలు ఏం ప్రశ్నిస్తాయి
పంచనాదాలు ఏం సాక్ష్యం చెబుతాయి
నేను ఈది వచ్చిన సముద్రాలు ఎవరికి తమ లోతుల్ని వివరిస్తాయి
నన్ను ఎగరేసుకు వచ్చిన రెక్కలు ఎలా తమ వేగాన్ని వర్ణిస్తాయి
ఎగసిపడి అలలు మీదబడ్డప్పుడూ నేను ధైర్యం కోల్పోలేదు
ఎదురుకొట్టే ప్రభంజనాల్లోనూ నా ఊపిరి పోగొట్టుకోలేదు
అయినా విర్రవీగలేదు
నాకు నేను తప్పిపోలేదు
ఎప్పుడూ లోకం కాపరికి లొంగే నేను చరించాను.
అతను నా మెడలో కట్టిన గంట మోగిందని ఆరోపణ ఎందుకు?
నేనెప్పుడూ ఆయన పదాలనే అనుసరించాను
నా జాడ మారిందని నిందెందుకు
నోటిని కట్టేసిన మౌనవిషాదం ఏ రాగాన్నెలా ఆలపిస్తుందో ఎవరికి తెలుసు
మోసేగుండెకు కాక ఆ అంతులేని రాగ మెంత దుర్భరమో ఏ చెవులకు తెలుసు
అందమైన చర్మం పొట్లంలో ఏం చుట్టబడిందో ఎవరికీ తెలియదు
ఎంత కళ్ళు చించుకు చూసినా చీకటీ చుక్కా తప్ప మరేం కనపడదు
నేను జీవించవలసిన కాలంలో కాదు నేనున్నది
ఉన్నదంతా సున్నా అయ్యే వర్తులంలో ఎన్ని దేశాలకడ్డంగా పయనించినా ఉన్నచోటేగా మనిషి పడున్నది
ఇక్కడ తనకు తాను గాక మనిషికి మరో న్యాయాధికారి ఎవరు
తన ఎదుటబడే మరో ముద్దాయి ఎవరు
- గంగిశెట్టి లక్ష్మీనారాయణ, 001-510-953-8608