Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకుని ఉంటావ్
స్వతంత్ర దేశంలో నీకూ స్వేచ్ఛ ఉందని
ఊహించి ఉండవు
వాన నుంచి కాపాడిన చెట్టే మృత్యు కుహరం అవుతుందని
దుమారపు గాలులు
నీ చావు కబురు నీకు వినిపించలేదు కాబోలు
అనుకునే ఉంటావ్
రాలి పడిన పండ్లు పనికి రానివే అని
పసి బిడ్డలకు ఫలాల రుచి చూపాలని
తండ్రి మనసు తహతహలాడిందేమో
రెండు అంటే రెండు
రాలి పోయిన పండ్ల పాటి విలువ చేయవు నీ ప్రాణాలు
దాస్యాన్ని కోరే విశృంఖలత
నరనరానా పాతుకున్న సమాజంలో
బలహీనుని బాధే వినోదసాధనమవుతుంది
గాయపడిన దేహాలను కుళ్ళబొడిచే
సున్నిత లోకం ఆవును అదిలిస్తే హడలిపోతుంది
రక్తపు మడుగుల్లో శవాలను పాతరేసే
పసి హృదయ పాషాణ ప్రపంచం
సాకేదైనా కాని కులమైతే కరకు కత్తులు దూసుకుపోతారు
పుట్టెడు దు:ఖాన్నైనా మూట గట్టుకో
నిస్పృహలకు తావు లేని భావితరం సృష్టి కోసం
సహనపు చిరునామా నీవై
అహంకారపు డీఎన్ఏల మార్పుకై ఇప్పటి నుంచే పునాది వెరు!!
- నస్రీన్ ఖాన్,
9652432981