Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధామ గత యాభై సంవత్సరాలుగా సాహిత్యరంగంలో వున్నారు. తొలినాళ్ళలో యువభారతి ద్వారా కవితా సంకలనం తెచ్చారు. తదుపరి ఆకాశవాణిలో పని చేస్తున్నప్పటికి అడపా దడపా పత్రికల్లో రాస్తూనే వస్తున్నారు. ఆ క్రమంలోనే 2015 -2016 లలో మన తెలంగాణ పత్రికలో ఎడిట్‌పేజీలో సుధామయోక్తి శీర్షికన కాలమ్‌ను నిర్వహించారు. దీనికి ముందే పదిహేను సంవత్సరాలుగా ఇతర పత్రికల్లో శీర్షికలను, పజిల్‌ను నిర్వహిస్తున్నారు. కాలమ్ నిర్వహించడం అంటే కాలంతో ప్రయాణించాలి. అంతేకాదు సమకాలీన అంశాలను తీసకుని చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంటుంది. అందువలన ఒక సంయమనంతో ఈ కాలమ్‌ను నిర్వహిస్తూ మంచి వ్యాసాలను అందించారు.
ఒక వ్యాసంలో 'గ్రామీణ జీవన పరిస్థితుల ఆధారంగానే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఉద్యమాలకు ఊపిరులూదింది గ్రామీణులే. తెలంగాణ ఆవిర్భావంలో కూడా అన్ని జిల్లాల వాసుల, గ్రామ ప్రజల చైతన్యం పోషించినదే ప్రధాన పాత్ర! అందుకే తెలంగాణ అభివృద్ధి, నవ నిర్మాణం కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకూడదని, తెలంగాణ గ్రామాలన్నీ, సర్వతోముఖాభివృద్ధి చెందాలని గ్రామీణ జ్యోతి అంశంగా గుర్తించడం ముఖ్యం అని అంటారు.
ప్రస్తుత పాఠ్యాంశాలలోని సిలబస్‌ను గమనించి ఒక వ్యాసంలో ఇలా ''బడి పలుకుల భాష కాక, పలుకుబడుల భాషను ఉపయుక్తం చేసిన ప్రసిద్ధ కథా రచయితలు, కవులు ఎందరో వున్నారు. వారికి సంబంధించిన అంశాలను తెలుగు సిలబస్‌లో చేర్చడం బాగుంటుంది కానీ, బొడ్డూడని నిన్న మొన్నటి కవుల రచనలు, సంకలనాలను సిలబస్‌లో చేర్చడం, రెండో రకం స్థాయి భాషా వైదుష్యం గల వరి రచనలను తవ్వి తలకెత్తడం, భాషాభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో ఆలోచించాలి. సిలబస్ నిర్ణాయకులు వైయుక్తిక ఇష్టాలకు, అస్మదీయులకు మేలు కూర్చాలనే, పేరు తేవాలనే తాపత్రయ పడడం కాకుండా, తెలంగాణ భాషాభివృద్ధికి, వికాసానికీ, విద్యార్ధుల విద్యా ప్రమాణాలకి దోహద పడేలా సిలబస్‌ను రూపొందించాలి. గురువుల సిలబస్కాక, లఘువుల సిలబస్‌ను రుద్దితే ప్రమాణాఉ పడిపోవడం ఖాయం. విద్య - విజ్ఞాన వికాసాలను కలిగించాలి. మనిషి సంస్కారాన్ని పెంచాలి. జీవన ప్రమాణాలను, మానవీయ విలువలను ప్రోది చేయాలి. అలాంటి సిలబస్‌ను అందిపుచ్చుకుని అధ్యయనం చేసి విద్య, విద్యార్థులు పోరుగమించినప్పుడే అక్షరమైన బంగారు తెలంగాణ సాధ్యం'' అని అంటారు (పుట 101). పాఠ్యాంశాల నిర్ణయంలో కూడా రిజర్వేషన్లను పాటించడం ఎంత శోచనీయం.
సుధామ గారు ప్రతి వ్యాసంలోనూ అనేకమైన సూచనలను, మార్గదర్శనం చేశారు. భావి తరానికి కావలసిన అనేక విషయాలను రేకెత్తించినారు. సాధారణంగా కాలమ్ అంశాలు తాత్కాలిక మనిపించినప్పటికీ, ఈ కాలమ్ సార్వజనీనంగా కొన్ని విషయాలను అందించింది. అందుకు సుధామకు అభినందనలు.
మన తెలంగాణ సుధామయోక్తి, సుధామ, పేజీలు : , వెల : 150/-. ప్రతులకు : సుధామ, 6-12, సారత్ టవర్స్, పద్మావతి అపార్ట్మెంట్స్, సలామ్నగర్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్ - 36.
- టి.శ్రీరంగస్వామి