Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ రెండు మామిడి పండ్లు
నాతో ఏడగుడులు నడిచివచ్చిన నా ఇంటిదాన్ని
అమాంతం ఎడారిలోకి తోశాయని తెలిసి వుంటే
వాటిని ముట్టేవాణ్ణే కాదు
రెండే రెండైన ఆ పండ్లు
నా జీవితమ్మీదికి ఆప్యాయంగా అల్లుకుంటూ ఎదుగుతున్న నా చిన్నారులకు
'తండ్రి లేనోడ'న్న కొత్త పేరును తగిలిస్తాయని ఎరుకై వుంటే
ఆ పండ్లను నా ఎడమకాలితో కూడా తాకే వాణ్ణి కాను
మనుషుల రక్తాల్లో ప్రవహిస్తున్న కులాల
మనుషులు పెట్టిన చెట్లలోనూ
చెట్లకు కాసిన ఫలాల్లోనూ మొరుగుతాయని తెలిసివుంటే
అసలు పండ్లు తినటమే నేర్చుకునేవాణ్ణి కాదు
మిగిలిన కులాలతో సమానంగా
తినటమే నేరమౌతున్న దళితులకు
మామిడి పండ్లు సైతం యమపాశాలనే విసురుతాయి
మనుషులకే కాదు
ఇక్కడి చెట్లకూ - పండ్లకు కులాలు మొలిచి
నాలాంటి వాళ్ళను వేటాడుతాయని తెలిసి వుంటే
ఆ రెండు మామిడి పండ్ల మీద ఒట్టు
నేను ఈ దేశంలో పుట్టేవాణ్ణే కాదు
- తోకల రాజేశం,
9676761415