Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె
కన్నవారి ఇంట్లో అత్తారుబత్తెంగానే పెరిగుంటుంది
ఇంటి పేరు మారాక
పుట్టింటి వాళ్ళ కరుణ కరువై నట్లుంది
మెట్టింటి వాళ్ల ప్రేమ సరేసరి -
నిరాశ రెక్కలుడిగి బతుకు మీద భరోసా తగ్గిందేమో..!!
ఇక్కడా అక్కడా కనుచూపుమేరలో
బతికేందుకు ఆధారం కనిపించలేదు ఎక్కడా!!
గ్రంథపుటలకు చెదలుపట్టినట్టు భావన-
ఆమె....
జీవితపుస్తకంలో రెండు పంట పుటలు అదనంగా చేరాయి...!!
వాటిపై పిచ్చి రాతలు భవిష్యత్ జాతకాలు ఎలావున్నా
ఎదురుగా ఎందరో మనుషులున్నా
చుట్టూ ఎటూ పోలేని నాలుగుగోడలే -
సంపాదనలేని పనిదానిగా చీదరింపులూ చీవాట్లూ -
కన్న కలలన్నీ కనాలనే ఆశలన్నీ ఆవిరౌతున్నవేళ
మౌనం రోదిస్తూనే వున్నా అయినా ఆమె చెదిరిపోలేదు
కన్నీళ్ళు ఎంతగొప్పవో?
దిక్కుతోచనప్పుడు అవే తోడవుతాయనుకోలేదు
ఆశ చచ్చినప్పుడల్లా చావు కోరుకోవడం
విరక్తి పుట్టినప్పుడల్లా విధిని తిట్టుకోవడం
అన్నింటికీ ఆ భగవంతుడే
కారణంగా అనుకోవటం పరిపాటైంది....!!
కానీ-
కన్నీళ్ళలో సలసల కాగుతున్న నీళ్ళుంటాయని
కళ్లల్లో నిప్పుగుండంలుంటాయని తెలిసినాక
ఆమె.....
కష్టాలను చిరునవ్వులో దాచుకుని
పోరాటమొక్కటే మార్గమని
అశ్రుముద్ర ఆయుధంగా మలుచుకుంది...!!
- వాసరచెట్ల జయంతి,
9985525355