Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తూర్పున దీపాన్ని వెలిగించి
ఈ రోజుని తెరిచాను
కొత్త అనుభవానికి దారి తీసింది
కళ్ళు ఇవ్వాళే కొత్తగా తెరిచానా
ఈ రోజేమయినా సరికొత్తగా విచ్చుకుందా
లేదే
నిన్నటికి ఇవ్వాళ కొనసాగింపు
రేపటికి దారితీసే పెద్దర్వాజా కదా
గడిచిన నిన్న
మంచినో చెడ్డనో తీపినో చేదునో
దు:ఖాన్నో సంతోషాన్నో
లేదూ
కిచిడీలా అన్నింటినీ కలగలిపి
మిగిల్చి పోయింది కదా
అన్నింటినీ కన్నీళ్లలో రంగరించి
మిక్సీలో వేసి రుబ్బినట్టు గిరగిరా తిప్పి
నిద్ర పొరల్లో కప్పేసాం కదా
నిద్రేమో కనుపాపలకీ రెప్పలకీ నడుమ
దొంగాట ఆడుతూ
మనసును 'మెలకువ' పాల్జేస్తూనే వుంది
కష్టంగానో ఇష్టంగానో
గతంలోకి జారిపోయిన 'నిన్న'
నన్నింకా వదల్లేదు
మరుపు పొరల్లోకి ఇంకనే లేదు
జ్ఞాపకపు తెరలాగా కదుల్తూనే వుంది
అయినా
గొప్ప ఆశతో తూర్పున దీపం వెలిగించి
కొత్త రోజుని తెరిచాను
కొత్త పనిలో పడ్డాను
పని కదా
నన్ను బతికించేది, కన్నీళ్లను తుడిచేది
చరిత్రను నిర్మించేది
పనే కదా
ఎవరినయినా నిలబెట్టేది
నాలుగు కాలాలు నడిపించేది
- వారాల ఆనంద్,
9440501281