Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భావాలను కవిత్వంగా మలచడంలో తిలక్ బొమ్మరాజుది ప్రత్యేక శైలి. తేలికపాటి పదాలతోనే బరువైన భావాన్ని కవితాత్మకంగా సృష్టించగలరు. ఎటువంటి అక్షర హంగూ ఆర్భాటం లేకుండా ఉంటాయి ఆయన కవితలు. రోజువారీ జీవితపు సంఘర్షణలనే కవితా వస్తువులుగా మలుచుకోవడంలో తిలక్ ది అందె వేసిన చేయి. వ్యవస్థపై చక్కటి అవగాహన ఉన్న తిలక్ ఇప్పుడు 'తదేక' పేరుతో సాహితీ మితృలను పలకరిస్తున్నారు. చాలా ఏళ్ళుగా కవిత్వం రాస్తున్నప్పటికీ ఎటువంటి హడావుడి లేకుండా చాలా నింపాదిగా పుస్తకాన్ని తీసుకువచ్చారు. నిజానికి మితృల ప్రోద్బలం వల్లే పుస్తకాన్ని ముద్రించారు. దృశ్యాలను కవితలుగా అల్లే తిలక్ ప్రకృతి అనే కాన్వాస్ పై సముద్రపు రంగులతో ఇంద్ర ధనస్సులను ఆవిష్కరించారు. ఒక్కటొక్కటిగా కవితలు చదువుతున్నంతసేపూ ప్రతి కవితా రైలు కిటికీలోంచి కనిపించే దృశ్యాల్లా కొత్త కొత్తగా గోచరిస్తుంటాయి.
'పుస్తకాల అరల్లో తీసిన పుస్తకం వెలితీ/ పిల్లలు వదిలేసిన అడుగుల్లోని పాదధూళి సువాసన/ యెప్పటికీ వదిలి వెళ్ళదు మనల్ని' అంటారు పిల్లల్ని దీపస్తంభాలుగా పోల్చుతూ. బంధాలు అనుబంధాలు మృగ్యమౌతున్న నేటి సమాజంలో ఎంతో గాఢమైన స్నేహబంధం నుంచి ఒక స్నేహాన్ని కోల్పోయే మనుషులపై ద్ణుఖపడుతూ 'స్నేహపు విరమణ' అనే కవితను రాశారు. 'నేను పొర్లి పొర్లి నీ మెడ చుట్టూతా/అల్లుకున్నా నీ విరమణ తథ్యమన్నావు'... మరోచోట 'వొక శూన్య వూపిరి/ఒక నిశ్శబ్దం/ వో అనిశ్చల శరీరం' అంటూ వ్యక్తీకరించుకున్నారు.
'నిష్క్రమించడం తప్పనిసరైనప్పుడు వెళ్ళిపోవడమే మంచిది/వెలుతురులో నుండి చీకటిలోకీ/ భూమ్మీద నుండి మెత్తని మట్టిలోకీ' అంటూ తాత్వికతను ప్రదర్శించారు 'సాలీడు తెరలో చిక్కిన గతుల్' అనే కవితలో.
'అన్నం జిగురు పెదాలు గీసుకున్న పెద్ద ప్రకృతి నిర్మాణం' అంటారు 'స్థిరమా...' అనే కవితలో.
'తిలక్ అందించే కవిత ఫిలసాఫికల్ ఇమాజినరీ' అంటారు పుస్తకానికి ముందుమాట రాసిన నిశీధి. ప్రతి కవితా దృశ్యమానికంగా ఉండడమే ఆమెతో ఇలా చెప్పించి ఉండవచ్చు. మొత్తం 75 కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతీ కవిత ఎంచదగినదే. పుస్తకం పూర్తయిన తరువాత ఎన్నో మధురానుభూతులకు లోనవడం ఖాయం.
'తదేక' రచన : తిలక్ బొమ్మరాజు, పేజీలు :120, ప్రతులకు : కినిగె.కామ్
- నస్రీన్ ఖాన్