Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత ఈదినా
ఇక్కడే ఉంటున్నావేమిటి
ఎన్ని సార్లు మునిగినా
దరి దొరకడం లేదెందుకు
వడి కొద్దీ ఉరికినా ఏదీ
అందుకోలేకపోతున్నావెందుకు
ఎంత హైజంప్ చేసినా
ఏ తారకా దొరకనంటుందే
బహుశా అతివృష్టి
కురుస్తుందనుకుంటా
తడి ఒంటి మీద
కొండగాలిముద్దాడిందనుకుంటా
పులకరించక ముందే
లోకం వణికిస్తుందనుకుంటా
ఏ స్పందనా లేని వాక్యాలు
ప్రచారమై ఊరేగాయేమో
కన్నీట కారిన వలపోత
కనుమరుగయిందేమో
ప్రవాహంలో కొండ ఎదురైతే
పడవంతా దానిచుట్టే
తిరుగుతుంది
ఈదురు గాలికి వొణికిపోతే
ఆస్తిత్వాన్నే ఊడ్చుకుపోతుంది
సుడిగాలి నడుమ నిలబడ్డావా
నిలబడతావ్
కాలాలు మారినా నిలబడాలి
పక్షాలు వాదాలు
మార్చుకున్నా ఎదురీదాలి
కొండ ఎదురైన చోట
ఈదడం తప్పు
ఊపిరి బిగబట్టుకొని కదా
లాంగ్ జంప్ చేయాల్సింది
- ఏనుగు నరసింహారెడ్డి,
8978869183