Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిశ్చలమైన ఆకాశం అంటే
మబ్బులులేని ఎడారి అని కాదు.
ట్రాఫిక్‌తో అలిసిపోయినప్పుడు
రోడ్డు హాయిగానే వుంటుంది,
కాని నిర్మానుష్యం
అమానుష్యం కింద లెక్క!
పరిశుభ్రత అంటే
క్రియాశూన్య నేత్రోత్సవం కాదు.
చెమట చుక్కల్లో తడవనిది
ఏదీ పవిత్రం కాదు.
వొంగిన నడుము
అదొక ఇంద్ర ధనుస్సు,
అరచేతిని చూసుకుంటే
గీతలన్నీ
శ్రామిక నదులై ప్రవహించాలి,
వేళ్లకు
రాళ్లుకూడా భయపడాలి.
కబుర్లు అంటే
రహిత కార్య తత్పరతకాదు
చైతన్యం తీరాన
ఏరుకునే నత్త గుల్లలు కావాలి.
ఈదటం వల్లే
ఎముకల కింత బలం.
మనస్సు చేపలాంటిది,
గడ్డ కట్టిన జలాశయంలో
అది నిశ్చలన పుష్పమౌతుంది.
దూరం అంటే
అది అందరాని గమ్యంకాదు
నడకతో మీటిన దారి
అది ఎప్పటికీ చెలరేగే గోదారి.
ప్రేమ అంటే
అది కేవలం అనుభూతి కాదు,
అనుభవ మథనంలోంచి పుట్టే
అనురాగ గీతి.
- డా|| ఎన్. గోపి