Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విత్తిన ప్రతి విత్తనమూ
మొలకెత్తనట్లే
రాసిన ప్రతి పద్యమూ
స్వప్నాలను వాగ్దానం చేయలేదు!
అరువు తెచ్చుకున్న అనుభవాలు
సరికొత్త అనుభూతుల్ని పంచలేవు
నలిగిన మాటలకు
వ్యక్తిత్వాలను నిలబెట్టే శక్తి ఉండదు!
లోన నిరంతర మథనం
అల్ల కల్లోలం చేయందే
లోకానికి పంచే శబ్ధాలకు
మంత్ర శక్తి అబ్బదు!
రోజంతా గాలి మాటలు వినీవినీ
విసిగెత్తి పోతుంటే
అమృత తుల్యమైన మాటల్ని అలలపై విసిరే
పెంక బిళ్ళల్ని చేస్తుంటే ఆగ్రహంతో ఊగిపోతున్నా!
శబ్ధ కాలుష్యం ఒక్క వాహనాలదేనా?
వృధా ప్రసంగాలు పరిహరించి చూడు
లోకం లోపలా బయటా
ఒక నిశ్శబ్ద తపోవనం విస్తరిస్తది!
నాలుకను నియంత్రించుకోలేనప్పుడు
జీవితాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలే
ఆచరణ యోగ్యం కాని పలుకులేవైనా
తలవొంపులకు దారి తీస్తాయి!
ఏది రాసినా ఏది పలికినా
ఒక కాంతి కవాటం తెరచుకోకుంటే
మౌన ముద్ర దాల్చడం కూడా
మనం చేసే లోకకళ్యాణమే!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
9440233261