Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్య వనంలో తరిగిపోని సువాసనల మల్లెచెట్టు శతకం. శతకమంటే నూరు పద్యాలన్న అర్థమున్నా నూరు దగ్గర ఏ కవీ ఆగలేదు. వృషాధిప శతకం నుండి బాలబోధ దాకా తెలుగు శతకాలను లెక్కించుట ఏ పరిశోధనా మాత్రుడి తరం కాదు. ప్రతి ఊరిలో ఒక కవైనా ఉన్నట్లు, ప్రతీ కవీ ఒక్క శతకమైనా రాసి తీరేవాడు. ఆధునిక కాలానికి పూర్వం, ఆధునిక కాలంలో పద్యం రాస్తున్న ప్రతికవీ శతకం రాస్తాడని చెబితే అతిశయోక్తికాదు. బహుశా బొంత లచ్చారెడ్డి మొదటి కవిత్వమీ శతకమే అయి ఉంటుందని నా ఊహ.
శతక విస్తృతికి కారణం అందులోని సౌలభ్యమే. సౌలభ్యాలలో ఒకటి ముక్తకం కావడం. మరొక కారణం నేరుగా పాఠకుడిని సంబోధించగలగడం. అంతరంగాన్ని బహిరంగ పరచడానికి ఏ కథా, ఏ ఎత్తుగడా అవసరం లేకపోవడం మరొక కారణం. బద్దెన కందంలో రాస్తే, వేమన ఆటవెలదిలో చెబితే, కాకుత్సం శేషప్ప సీసంలో సాగితే, ధూర్జటి, కంచర్ల గోపన్న, దాశరథి వృత్తాలలో శతాధిక పద్యాలు వెలువరించారు. వంద, నూటా ఎనిమిది, నూటాపది, మూడున్కొకట్లు, నూటాపదహార్లు, రెండు వందలు, ఐదు వందలు, వేలు - శతక సంఖ్యకు గరిష్ఠ పరిమితి చెప్పడం కష్టం. వేమన, సుమతి శతక కారుల పద్యాలెన్నో లెక్క దొరకలేదు. మకుటం మాత్రం అంతా పాటించారు. నీతి, భక్తి, వేదాంతం, వైరాగ్యం, హాస్యం, వ్యంగ్యం శతక కవిత్వ వస్తువులయ్యాయి.
బొంత లచ్చారెడ్డి 'బాలబోధ' ఆటవెలది శతకం. నూటా ఒక్క పద్యాలున్నాయి. మకుటంలో 'బాల' మాత్రమే కామన్. నీతి ఇందులో వస్తువు. నీతి అనడం కంటే హితబోధ అనడం సరియైనది. క్రమశిక్షణ కూడా అనవచ్చు. బాలలకు క్రమశిక్షణ బోధించిన శతకమిది. సామల సదాశివ విద్యార్థులకు రాసిన క్రమశిక్షణ పద్యాలను గుర్తుకు తెస్తుందిది. రాముడు, వాల్మీకి, కృష్ణుడు, బాలచంద్రుడు, సాందీపముని, శివాజీ, అభిమన్యుడు తదితర చారిత్రక, పురాణ పురుషుల గాథలను రేఖామాత్రంగా స్పృశిస్తూ ఆ కథలోని నీతిని చెప్పే పద్యాలున్నాయి. కొన్ని నేరుగా నీతి బోధలు ఉన్నాయి. పరిశీలనా దృష్టి, హితబోధ లోని ఆసక్తి కవిలోని ఆకాంక్షకు అద్దం పడుతున్నాయి. కథ చెప్పడం లోని ఆసక్తి సాధారణంగా శతక కవులలో ఉండదు. లచ్చారెడ్డిలో మాత్రం ఉన్న ఈ నాలుగు పొట్టి పాదాలలోనే కథ చెప్పి, నీతి చెప్పి, మకుటాన్ని కూర్చోబెట్టి మెప్పిస్తాడు. ఈ నీతి కథను చూడండి.
'అడవిలోన సింహ మరయంగ రారాజు
చంపితినెను నడవి జంతువులను
పరగ నీడను జూపి బావిలో పడజేసె
చెవుల పిల్లి కతను చెన్నుబాల'
మరిన్ని మంచి పద్యాలు, పరిణత వాక్యాలు బొంత లచ్చారెడ్డిగారి నుండి సాహితీప్రియులు అశించవచ్చు.
- ఏనుగు నరసింహారెడ్డి,
89788 69183