Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదిగిన చెట్టు చిన్ననాటి
అనుభూతుల్ని యిగురువెట్టింది
జోరుగాపారే నది తను పాయగా మొదలైన
యాదుల్ని నెమరేసుకున్నది
అనేక ఊర్లను ఈదుకుంటూ వచ్చిన పిట్టలు
బడి ఒడిలో కేరింతలు కొడుతూ ఆడుతున్నై
ఆ రోజంతా బడి
తీరొక్క పక్షుల పలకరింపుల పాట
పొలిమెర దాటని గువ్వలు
నగరం కొమ్మపై వాలిన పావురాలు
సరిహద్దు దాటొచ్చిన కొంగలు కొన్ని
ఆడి పాడి కవ్వించి నవ్వించి తోటను ఉల్లాసపర్సినై
తోటమాలి సేవలను బృందగానం జేసి
పూలుజల్లి సత్కరించినై
రాలిన పూలపై సానుభూతి చినుకులు రాల్చి
వాటి పుప్పొడి భుజంతట్టి చేయూతనిచ్చినై
లేత మక్కకంకులసుంటి
అక్షరాలను ఒలిసి తినవెట్టి
బతుకుదారిసూపిన చెట్టునీడన
యాడాదికోపాలి అలారు బలాయిలై
అల్లుకోవాలని తీర్మానించుకున్నై
నోటకర్సుకున్న ఆనందాలతో
తోటవీడి పోలేక పోలేక
పటపటపట రెక్కలాడిస్తు వచ్చిన బాటపట్టినై
తిరిగి కలుసుకొనడమంటే
ఓచోట పోగేసిన అనుభవాలను
దండగుచ్చుకోవడమే..
- వడ్లకొండ దయాకర్,
9440427968