Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమో యే భూభాగమో
యే రెక్కతెగిపోయిన విహంగమో
యే గాయపడ్డ గగనతలమో
అక్కడ రెండు కన్నీటి చుక్కలు
అణుబాంబులు
అక్కడ ఆకలి కరువుకేకల
మానవవిస్ఫోటనాలు
ఏమో
ధ్వంసం గావింపబడుతున్న ప్రతి అస్థిత్వం
ఆక్రమణకి గురైన ప్రతిదేహం
తనని తాను విసిరి పారేసుకునే
మారణాయుధ సమూహం
రేపో ..
లేదూ యే మరోఇంకో రేపో
ఉదయాలు చూడనీక యంత్ర విహంగాలు
నీ ముఖం మీద
రక్తసింధూరం పూయగలవు
ఏమో
కౌగిలి చాపి శాంతి మంత్రం చదువుతూ
వేటగాడి చరిత్రలో జింక పిల్లే నేరస్తుడవ్వచ్చు
వేటగాడు శాకాహారి సూక్తుల్ని వల్లె వేస్తూ
ఆదర్శవంతుడూ అవ్వచ్చు
నువ్వూ నేనూ
వార్తా పత్రికల్ని తిరగేసుకుంటూ
ఊంచా రహేగా హమారా అని
చప్పరిస్తున్న కాఫీ సాక్షిగా
మట్టి తల్లీ .. మట్టి మాతకూ
నరబలుల్ని శాంతికోసం బలివ్వచ్చు
నీకో విషయం తెలుసా ?
శాంతికోసం ఇచ్చే నరబలి
వాళ్లకు అతిపెద్ద వీరభక్తి
అందులో తప్పులేదంటారు వాళ్లు
చూస్తూ ఉండూ
రేపు నీ రక్తం అంటిన చేతులకి
నోబుల్ శాంతి బహుమతీ ప్రకటింపబడొచ్చు
అవునూ అక్కడో చిన్ని తల్లి
యుద్ధం వద్దని తన డైరీలో
ఓ చరిత్రకు తన ప్రాణాన్ని పోస్తూ ఉండవచ్చు
- మెర్సీ మార్గరెట్,
9052809952