Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాతెండి తట్టల పసుపు వన్నెల ఇత్తులు
చెంప చెంపలకూ అద్దుకున్న సింగారం
నొసళ్ళ మీద మెరుస్తున్న కుంకుమ బింబం
పాద పాదాలకు పసుపు పచ్చ పూత
ఇల్లు ఇల్లంతా ఆడి బిడ్డల అడుగుల సవ్వడి
అయిదు కుడుకులు అయిదు పోకవక్కలు
ఖర్జూరలు తమలపాకులు
చీర రైకలు, దోతుల జోడా తువ్వాలలు
అయిదుగురు ముత్తైదువలు
అయిదు దోసిళ్లతోని బియ్యం పోసి
ఒడి నింపుడొక తోడబుట్టిన తనం
బిడ్డా అల్లుడు, చెల్లేబావలకు
ఐదేళ్లకోసారి కొత్త బట్టలు పెట్టుడు
ఇంటింటా మది నిండే పండుగ
వేరు వేరై ప్రవహించిన పందిరి తీగలు
అవ్వగారింటి జ్ఞాపకాల లోకాన్ని
పండుగ పండుగల్లో దీవించే దీపంతలు
పసుపూ బియ్యం అనుబంధాన్ని పెంచే ఆచారం
తెంపు కున్న పేగు మడత ఒక్కటే
తాగిన చనుబాల ధరా ఒక్కటే
ఊగిన ఉయ్యాల, అంబాడిన వాకిలి
ప్రవాహమైన అంశ చెదిరి పోదు
ఇంట్ల మొక్కలే సుదూర సుట్టాలై నంక
ఓసారి వచ్చిపోవుడే పెద్ద పండుగ్గోలే.
- అన్నవరం దేవేందర్,
9440763479