Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈడ అదిరితే అదిరిస్తరు
బెదిరితే బెదిరించి తర్ముతరు
ఎవడి బరువు వాడెత్తాల్సిందే
కష్టాలు ఎదురైనా కాలంతో ఎదురీదుతూ బతుకు నడక సాగించాల్సిందే...
అయ్యాల పసిబిడ్డ వై
అమ్మ వొడిలో ఉగ్గుపాలకై అంబగల్లాట
అమ్మ చిటికెనవేలుతో పడుతూ లేస్తూ తప్పటడుగులాట
బాల్యం బతుకు
తిన్న సద్ది కూడు మెతుకు
అతుకుల అంగీ చింపిరి జుట్టు
వాడనుంచి ఊరి బడికి చేతిలో
పలక బలపంతో
గంతులేస్తూ ఆశగా సాగిన నడక
అయ్య ఉడిగిన ఎముకల గూడుతో
ఆకలి బతుకు పోరాటం
అమ్మ ఒంటూపిరి వొందిల్ల ఆరాటం
తాత దగ్గులు తరాల రుక్మతి తండ్లాట
గీడ ఎవరూ ఎవరికీ ఊతమివ్వరు
ఎవనిపై ఎవడు కనికరం జూపరు
కొండల్ని పిండిచేసిన చేతులవి
కసరుకొనే చూపులకు బెదరక
సవట నేలలో ఆశల వూసుల
విత్తనాలు జల్లి కలల పంట
సాగు చేసిన చేతులవి
నమ్మకంతో నడక సాగించు
వమ్ము కానీ ఆశలతో
బతుకు పయనం సాగించు
- భూతం ముత్యాలు