Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవతల ఒక మనిషిని పలకరించడానికి
ఇట్నుంచి రాళ్ళదారిలోనైనా వెళతాడు
అవతల ఒక మనిషిని గట్టెక్కించడానికి
ఇట్నుంచి ఇక్కట్ల మెట్లెక్కయినా వెళతాడు
అవతల ఒక మనిషిని పరామర్శించడానికి
ఇట్నుంచి శీతల లేపనంలా వెళతాడు
అవతల ఒక మనిషిని ఓదార్చడానికి
ఇట్నుంచి ధైర్యవచనమై వెళతాడు
అవతల ఒక మనిషిని ఉత్తేజపరచడానికి
ఇట్నుంచి ఇంధనభరితుడై వెళతాడు
అవతల ఒక మనిషిని అభినందించడానికి
ఇట్నుంచి పరిమళాల పూలగుత్తిలా వెళతాడు
అవతల ఒక మనిషిని తేనీరుతో కలవడానికి
ఇట్నుంచి ఉత్సాహతరంగంలా వెళతాడు
అవతల ఒక మనిషిని అల్లుకోవడానికి
ఇట్నుంచి మెత్తని పచ్చని తీగలా వెళతాడు
అవతల ఒక మనిషిని పరిచయపరుచుకోవడానికి
ఇట్నుంచి కుతూహలపు బాటసారిలా వెళతాడు
అవతల ఒక మనిషిని తెలుసుకోవడానికి
ఇట్నుంచి వినయవిద్యార్థిలా వెళతాడు
అవతల ఒక మనిషిని ఉల్లాసపరచడానికి
ఇట్నుంచి శ్రావ్యస్వర సంపన్నుడిలా వెళతాడు
మరి ఇన్నిటికీ ఇన్నిటికీ వెళ్లడానికి
సమయమంటారా
దాన్ని ఎప్పటికప్పుడు తానే సృజించుకుంటాడు
ఇచ్ఛాశక్తితో!
(మిత్రుడు, మంచి వ్యాఖ్యాత
మడిపల్లి దక్షిణామూర్తికి)
- దర్భశయనం శ్రీనివాసాచార్య,
94404 19039