Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల దాచుకునేందుకో, తలపుల్లో తడిచేందుకో
మనిషికొక చెట్టుంటుంది
చంకనేసుకునో, చెయ్యిపట్టి నడిపిస్తూనో
ప్రతి పల్లెకొక అడవుంటుంది
చెట్టు స్పర్శకు నోచుకోని వాడు,
అడవి స్తన్యం తాగని పల్లెలు అనాథలే అన్పిస్తుంది
చెమట పరిమళంతో, పొద్దు గూకంగ
ఇంటికచ్చే అమ్మ నడక వేగం,
ఎర్రటెండల తర్వాత పల్లెల కోసం
అడవి తల్లి పంపిన మబ్బుల రాక చూసినంక
అడవి మాట వినబడంగనే
అమ్మ గుర్తుకురావడం అసంకల్పితం
నా కణాల్లో చిక్కని ద్రవ్యం నింపడానికి
నెత్తురుని ఆవిరి చేసుకున్న
అడవులన్నీ నాకు తల్లులే
అంటిపెట్టుకున్న కవ్వాల మాత్రమే కాదు
నల్లమల, ఆఫ్రికా అమెజాన్ లు కూడా
దూరానున్న పెద్దమ్మ చాక్లెట్లు, కొత్త అంగీలు పంపిన తీరు
అడవులన్నీ నాకు ప్రేమ పంచినవే.
తల్లి స్తన్యాన్ని పెకళించి
పిండుక తాగుడు తప్పుడు ఆలోచన
కడు చేదు ఎచ్చాలు మింగిన తల్లి
కన్నబిడ్డలను ఆకలుంచదెప్పటికి
ఉడుకపోతలు, కాలినడకలు
చిమ్మంజీకట్లనేగా భరించాల్సింది
మండుతున్న తల్లి చితి ముందు
వెలుగుల పండుగెట్ల చేసుకునుడు
ఇంతకీ,
నల్లమలన పెకళించిన యురేనియంతో
మనిల్లు వెలిగిస్తారా?ఎవనిల్లైనా కూలుస్తారా?
(యురేనియం వెలికితీత కోసం నల్లమలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ..)
- ముత్యం నాగవర్మ,
9490578855