Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిష్టి బొమ్మలు
దివిటీలు కాలేవు
దివాణంలో చేరినంక
దిక్కుమాలిన ఆజ్ఞలకు
దిగులుగా తలలూపడమే తప్ప
నీ శక్తినీ ఒక యుక్తిగా మార్చుకుని
ప్రజలను నమ్మించే ప్రహసనంలో
నీవు పాచికగా మారినందుకు
నీకు ఒక పీఠం దక్కింది
వాని తప్పటడుగులను తూచే
తరాజును గుంజుకొని
నీ శ్వాసను మాత్రమే మిగిలించి
జీవచ్ఛవం చేసిండు
గతం గాయాల నదిని మాత్రమే
నీకు గాత్రంగా మిగిల్చిండు
రాలిన ఆశలే
నీకు గాయాలైనయి
వర్తమానం వల్లకాడు అయింది
నువ్వు ఇంట్లున్నా
బయటున్నా
ఉయ్యాలలూపేది లేదు
జంపాల పాడేది లేదు
స్పందన లేని
కందెన శీల కావడం తప్ప
నువ్వూహిస్తున్న మంచి
ప్రజలను దగ్గరికి రానీయని ముండ్ల పొద
నువ్వు ఆశ్రయించిన మర్రినీడ
ముర్రుపాలు తాగకుండా
మూతులు బిగియకట్టే
మూర్ఖపు జాడ
మీది కుండ మీదుండంగా
కింది కుండ కిందుండంగా
నడిమి కుండను తప్పించే నేర్పరి
నువ్వు భుజానికెత్తుకొన్న భూజం
పుష్పించి
ఫలించి
నీడనీయలేని
ప్రాణసంకటపు బూజు.
- కందుకూరి అంజయ్య,
9490222201