Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిషేధానికి చోటులేని హానికరపు ట్యాగొకటి తగిలిద్దాం
మరికొన్నిటికి యదేచ్ఛగా పర్మిషనిద్దాం
రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటినట్టుగా నాటుదాం!
స్టాటిస్టికల్ అభివృద్ధి కావాలి మనకు
అంకెలు పేకమేడలై గాలిగోపురాలు పేర్చుకుందాం మనం!
ఆకాశహర్మ్యాలు, పూరిగుడిసెల మురికి వాడలు
గ్రాఫ్ హైబీపి పెరిగినంత అసాధారణంగా పెంచుదాం!
శృంగద్రోణుల తరంగ నిక్వణలు
పీక్ లెవల్ సంఖ్యాశాస్త్రంలో ఇమిడి పోవాలి తప్ప
సరళ తారతమ్యాల సామూహిక ప్రశాంతతల సంగీత ఝరిలాంటి జీవనసరళి
మనకెందుకు?!
సామ్రాజ్య సహజాభివృద్ధితో మనకేం పని?!
అది వాపో... నిండైన దేహబలమో ఏదైతేనేం?
ఉబ్బడం ఒక్కటే మన లక్ష్యం!
మనకాళ్ళు అభివృద్ధి చక్రాలు మన ఖ్యాతి దశదిశల మృదంగనాదాలు
ఈ మట్టి మూలమూలా గాజుసీసాల భాండాగారాలు
ఇక్కడి ప్రతిష్టలు పరిధులులేని మద్యపానపు దిగుళ్ళు!
ఈ మెదళ్ళు కట్టుబానిస తత్వ మనోగతాలు
ఇల్లు, కళ్ళు, ఒళ్ళు, మనసు వావి వరస వయసు మనిషితనం మరిచి
మైకంలో కుళ్ళుతున్న పశుసాంప్రదాయాలు!
ఎవరు సవరించాలి ఎవరు సరిచేయాలి
సమాజాన్ని నిందిద్దామా? మనిషిని నిందిద్దామా?
సంప్రదాయాలను నిలదీద్దామా...
సంస్కృతిని ప్రశ్నిద్దామా...
లేక ప్రజాస్వామ్యాన్ని తప్పుబడదామా....
ఏది ఎక్కడ తప్పు ఎందులో తప్పు ఏ విధానపు పొరపాటు....
మనిషీ! నువ్వే... నువ్వే స్వయంగా తేరుకో
నీ పసితనాల, పడుచుప్రాయాల, ముసలి భావాల ముసురు మేఘాల నుండి
నీ పచ్చని ఆవరణాన్ని నువ్వే కాపాడుకో
నువ్వే నిరంతరం సూర్యుడై మేల్కొనే ఉండు!
దేశం ఒక నీరు పట్టిన దేహమైంది అంతుచిక్కని జబ్బై కూర్చుంది
ఇప్పుడిక నిన్ను నువ్వు మాత్రమే రక్షించుకో
నిన్ను నువ్వు అమితంగా ప్రేమించుకో!!
- అరుణ నారదభట్ల,
9705015207