Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహ మానవుల
కష్టాలూ కన్నీళ్ల మంటల్ని చూసి
కరిగి వర్షించే కళ్లున్న
ఒక ముఖం కావాలి
నాకో ముఖం కావాలి
రంగులు రాలిన సీతాకోకల
రెక్కల్ని నిమురుతూ
ఓదార్పుగా నాలుగు మాటలయ్యే
నోరున్న
ఒక ముఖం కావాలి
నాకో ముఖం కావాలి
దగాపడిన తమ్ముళ్లను
మోసపోయిన చెల్లెళ్లను
అక్కున చేర్చుకుని ఓదార్చే
అన్నల్లాంటి ఒక భరోసానిచ్చే
ముఖం కావాలి
నాకో ముఖం కావాలి
దిగులు పొట్లమై ముడుచుకుని
కన్నీరు కాలువలు కడుతున్నపుడు
నీకు నేనున్నాను కదా కన్నా అని
అలసిన ముఖాన్ని
రెండు చేతుల్లోకి తీసుకుని
మెటికలు విరుస్తూ
ఆత్మీయంగా ముద్దులాడే
అమ్మలాంటి రెండు పెదాలున్న
ముఖం కావాలి
నాకో ముఖం కావాలి
బతుకులో ఎక్కడో
క్షణకాలం ఓడిపోయి
ఓ మూల చేరి
కన్నీటి ధారలై కురుస్తున్నపుడు
నీకు నేను లేనారా నాన్నా అని
కళ్లు తుడిచి కౌగిలించుకుంటూ
ధైర్య వచనాలు చెప్పే
నాన్నలాంటి
ఒక ధీరత్వం తొణికిసలాడే
ముఖం కావాలి
నాకో ముఖం కావాలి
బతుకు పడవకు చిల్లుపడి
ఏ ఆర్థిక తీరాన్నీ చేరలేక
పేదరికపు సముద్రంలో
తలకిందులై మునిగిపోతున్నపుడు
ముఖం చాటేసే
అనేక తెలిసిన ముఖాల మధ్య
నీకు నేను లేనారా అని
భుజం తట్టి నడిపించే
నాకున్న ఒకే ఒక
మంచి స్నేహితుడిలాంటి
ముఖం కావాలి
నాకో ముఖం కావాలి
ఏ ముఖం ఎవరిదో తెలియకుండా
అనేకానేక మాస్కులు తొడుక్కున్న
ఇన్ని ముఖాల మధ్య
ఏ మాస్కూ లేని
స్వచ్ఛమైన తేటనీటిలాంటి
పారదర్శకమయిన అద్దంలాంటి
ఒక మానవ ముఖం కావాలి
నాకో ముఖం కావాలి!
- చిత్తలూరి సత్యనారాయణ,
8247432521