Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా వరకు పుస్తక సమీక్షలు వస్తునాయి గాని వీటిని అందించడంలో మనకు కొన్ని సంశయాలున్నాయి. నిజానికి ఒక పుస్తక సమీక్షలో చేయాల్సిందేమిటనేది కూడా మనం మరచిపోయాం. ఉత్తరభారతంలో ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ భాషల్లో పుస్తక సమీక్ష కోసం కర్మశాలలు (వర్క్ షాప్‌లు), వర్క్ షీట్ (పని నమూనా)లు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి పుస్తక సమీక్ష, ఒక పుస్తకానికి అంటే ఆ రచయితకు పాఠకుడికి మధ్య వంతెన లాంటివి. ఇంగ్లీష్‌లో 'ఎ హాండ్ బుక్ టు రైట్ ఎ బుక్ రివ్యూ' లాంటి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. తెలుగులో ఇలాంటివి అందుబాటులో లేవు. అందువల్ల సమీక్షపై మనకు చాలా భ్రమలున్నాయి. సారాంశం, పుస్తక పరిచయం, సాహిత్యవ్యాసం, విమర్శ లాంటివి వేర్వేరు రూపాలు. కాని వీటి మధ్య ఆయా రచయితలను గౌరవించడం కోసం అందరికీ విమర్శ, విమర్శకుడు అనే పదాన్ని చేరుస్తున్నాం. అందువల్ల వీటిని వేరుగా అర్థం చేసుకోవడం, చర్చించడం ఈ కాలపు అవసరం.
ముందుగా సమీక్షను నిర్వచించుకోవడం ఒక అవసరం. 'ఈక్ష్య' అనే సంస్కృత పదానికి (ధాతువుకు) చూపు అని అర్థం. 'సం' అనేది ఉపసర్గ. 'సమ్యక్-ఈక్ష్యనం' బాగుగా, లోతుగా చూడడం అనే అర్థంలో ఈ పదాన్ని రూపొందించారు. సమీక్ష రాయడమెలా? సమీక్ష అంటే ఏమిటీ ?సమీక్షకు ప్రత్యేకంగా నిడివి ఉందా? సమీక్షకు ఒక ప్రణాళిక ఉంటుందా? పుస్తక సమీక్షకు పుస్తక సమాచారం లేదా వృత్తాంత రచనకు ఉన్న బేధమేంటి? పుస్తక సమీక్షలో ఏవి జతకలుస్తాయి? పుస్తక సమీక్ష ఉపయోగం ఏమిటి? పుస్తక సమీక్షలను ఎన్నిరకాలుగా చూడొచ్చు?ఒక విద్యా సంబంధమైన సమీక్ష రాయడం ఎలా? లాంటి ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కుంటే సమీక్షపైన ఒక స్థూలమైన అవగాహన వస్తుంది.
పుస్తక సమీక్ష అంటే వ్యక్తిగత అభిరుచి మేరకు పుస్తకంలోని అంశాల పరిణామాన్ని చర్చించేది. అందులోని అంశం, శైలి, ముఖ్యంగా యోగ్యతను గురించి చెప్పేది. భవిష్యత్తులో ఒక రచన గురించి జరిగే చర్చకు ఇది ప్రాథమిక ఆధారం. అభిప్రాయభాగం. సమీక్ష చేసే వ్యక్తికుండే అధ్యయనాన్ని బట్టి ఇది రెండు రకాలు. పరిశీలనాత్మక సమీక్ష (అబ్జర్వేషనల్ రివ్యూ); కేవలం పుస్తకం పై ఆధారపడి అభిప్రాయాన్ని చెబుతుంది. పుస్తకం ఏ సాహిత్య రూపానికి, ప్రక్రియకు చెందింది. ఇందులోని అంశం ఏ అంశంపై నిలబడింది. ఉదాహరణకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు మొదలైనవి. రచనలోని అంశంపట్ల కొత్తగా కనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఒక ప్రాథమిక పరిశీలన సమీక్ష చేసేపని. ఇక్కడ సమీక్షకుడు కేవలం పరిశీలకుడుగా ఉంటాడు తప్ప, పుస్తకంలోని విషయాలపట్ల నిర్ణయం చెప్పేవాడుగా కనిపించడు. అయితే సాహిత్య రూపం, అందులోని వివిధ ఉపభాగాలు, వాటి పరిణామాలపై సమీక్షకునికి అధ్యయనం ఉండడం కనీసావసరం. పద్యాన్ని, గేయాన్ని పాటను కవిత్వాన్ని వేరు వేరు ప్రక్రియలుగా చెప్పేవాళ్ళున్నారు. ఇది అవగాహనా లేమివల్ల కలిగే పరిణామం. వేర్వేరుగా ఇవన్నీ రూపాలు. పద్యం నిర్ణీతమైన ఛందస్సులో వచ్చేది. గేయం గేయ ఛందస్సులో వచ్చేది. మొదటిదాన్ని మార్గ ఛందస్సు, రెండవదాన్ని దేశీ ఛందస్సుగా చెబుతారు. పాట గేయఛందస్సులలోని నియమాలను కూడా త్యజించి కొన్ని సారూప్యతలతో నిలబడింది. వచనకవిత్వం కూడా అలాంటిదే. వీటి మధ్యలో వచనగేయం కూడా ఒకటి కనిపిస్తుంది. నిజానికి ఇవన్నీ కవిత్వం అనే ప్రక్రియలో భాగాలు. కాని వీటిని వేర్వేరు ప్రక్రియలుగా చెప్పేవారున్నారు. ఈ మధ్యకాలంలో వచనకవిత్వంలో నిడివితగ్గి వివిధ రూపాలతో కవిత్వం బయటికి వచ్చింది. వీటన్నిటినీ రూపం, ప్రక్రియ అనే జ్ఞానంతో పరిశీలించే అధ్యయనం ప్రాథమికమైంది. వీటిపై అవగాహన లేకుంటే ఆ సమీక్ష పాఠకునిలో సందేహాలనో, భ్రమలనో కలిగిస్తుంది తప్ప, వేరే ఉపయోగం ఉండదు.
అంశాన్ని పరిశీలించేప్పుడు కూడా సమీక్షకునికి కనీస పరిధులున్నాయి. అంశాన్ని వర్ణించకుండా ఆ అంశంపై అతని అభిప్రాయం ఏమిటో ఏకీభవించాల్సిందా? కాదా అనే పద్ధతిలో చెప్పడం అవసరం. ఉదాహరణకు అమ్మ అనే అంశంపై ఒక కవితను కవి ఇస్తే ''అమ్మ అందరికీ దేవత. దేవతకన్న గొప్పది. ప్రతివారికి తల్లి అనేది గౌరవప్రదమైన పదం'' లాంటి వాక్యాలు వర్ణనాత్మకమైనవి. అమ్మ గురించి ఏం చెప్పాడు. అలా చెప్పడానికి కవి/ రచయిత చూపిన కారణాలు, అందులోని భ్రమలు, వాస్తవికత వీటిని పరిశీలకుడుగా సమీక్షకుడు చేయవలసినవి. సమీక్ష పుస్తకం పైనే సాగాలి తప్ప, కవి రచయిత మీద కాదనేది మరో ప్రధాన అంశం.
నిజానికి ఈ సాధారణ పరిశీలన పాఠక ప్రతిక్రియలాంటిది. పరిశీలనాత్మక సమీక్ష వ్యక్తిగతమూ, ప్రాథమికంగా అధ్యయనం వల్ల కలిగిన అనుభవాన్ని మాత్రమే చెబుతుంది. భావి పరిశోధనకు కనీస సమాచారాన్ని (మెసేజ్) ఇది ఇవ్వగలుగుతుంది గాని విషయాన్ని (సబ్జెక్ట్/ కంటెంట్) కాదు. ఈ పనిని విద్యాత్మక సమీక్ష (అకడమిక్ రివ్యూ) చేస్తుంది. సారాంశాన్ని ఇచ్చి అంశాన్ని, వర్ణనను చేసి సమీక్షగా భావిస్తే అది నిష్ప్రయోజనమైనది. పరిశీలనాత్మక సమీక్ష ప్రాథికమైందే అయినా దీనికి కొన్ని లక్ష్యాలున్నాయి. ఇది పుస్తకానికి సంబంధించిన కేంద్ర భావన (సెంట్రల్ ఐడియా)ను ఇస్తుంది. రచయిత శైలికి సంబంధించిన సూచనను, విషయాన్ని రచయిత సమీపిస్తున్న తీరును, రచనలోని వాతావరణాన్ని పూర్తిగా పుస్తకం ఏం చెబుతుంది. దాని ప్రయోజనం మొదలైనవి చెబుతుంది.
ఒక విద్య విషయక సమీక్ష (అకడమిక్ రివ్యూ) పరిశీలనాత్మక సమీక్షకన్నా లోతుగా పుస్తకాన్ని పరిశీలిస్తుంది. అధ్యయనంలోనూ సమీక్షకునికి పరిశీలనాత్మక సమీక్ష రాసేవారికన్న లోతైన అవగాహన అవసరం. అలాంటప్పుడే ఇది ప్రయోజనాత్మకమౌతుంది. విద్యావిషయక సమీక్ష మూడు విషయాలపై పనిచేస్తుంది. 1.వర్గీకరణ (క్లాసిఫికేషన్), 2.తులనాత్మకత (కంపారిజన్), 3.నిర్ధారణ (ఎవాల్యుయేషన్). ఒక పుస్తకం విషయంలో ఈ మూడు అంశాలను పరిశీలించడానికి సమీక్షకునికి ఆయా అంశాల చారిత్రక పరిణామాలపైన లోతైన అవగాహన, అధ్యయనమవసరం. వర్గీకరణ, తీసుకున్న పుస్తకంలోని సాహిత్య రూపం దానికి సంబంధించిన చారిత్రక పరిణామాలలో ఈ రూపం స్థానం. అందులో జతకూడే, విడిపోయే అంశాలు వాటి మూలాలు. ఉదాహరణకు గేయంలోని లయను వచనకవితలోని వచన తత్త్వాన్ని తీసుకుని వచన గేయం ఒకటి అలవాటులోకొచ్చింది. తెలుగులో శ్రీశ్రీ, కాళోజీ నాటికి ఇలాంటి రూపాలున్నాయి. వచనగేయాన్ని గమనించాలంటే లయను వచనానికి తేవడం, గతంలోని గేయంలో ఉన్న ఛందోబద్ధమైన లయను వదిలేయడం అనే ఎరుకవల్ల వీటిని సమీక్షకుడు చేయగలుగుతాడు. ఇది రూప సంబంధమైన వర్గీకరణ. విషయసంబంధమైన వర్గీకరణ మరొకటి. తీసుకున్న విషయంలో ఆ కాలానికి గతానికి మధ్య పరిణామాలను గమనించి తేల్చి చెప్పడం. వీటిపై నిర్ధారించగల అవగాహన ఉన్నప్పుడు వీటిని సమీక్షకుడు బాగా చెప్పగలడు. ఉదాహరణకు అభివృద్ధి, పారిశ్రామికీ కరణ, ప్రపంచీకరణ, కార్పోరేట్ లాంటి విషయాలలో రచన దేనిని ప్రస్తావిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన దేని ప్రభావం ఎంత. నిజానికి రచయిత గమనించాల్సినవి గమనించాడా? లేదా? అందులో లోపాలేమిటి అనేవి చెప్పగలగాలి. ఒక్కోసారి సమీక్షకుడు అధి విశ్లేషణ (మెటా అనాలసిస్) చేస్తాడు. ఆ సందర్భాలలో ఉపయోగిస్తున్న అంశాలకు సంబంధించిన పరిభాష తెలియడం అవసరం. దీన్ని సాంకేతిక వర్గీకరణ అంటారు. ఉదాహరణకు సంపుటి, సంకలనం- భావచిత్రం పదచిత్రం. చిన్నకథ-కథానిక లాంటి వాటిల్లో వైరుధ్యాలను, సారూప్యాలను గమనించి నిర్ణయం చేయగలగాలి.
తులనాత్మకత : ఇది కూడా అనేక రకాలుగా జరుగుతుంది. రెండు భాషల మధ్య, రెండు ప్రాంతాల మధ్య, రెండు తరాల మధ్య ఇలా ఎన్ని రకాలుగానైనా జరుగవచ్చు. తీసుకున్న పుస్తకానికి సంబంధించి దాని స్థానాన్ని నిర్ణయించడంలో ఈ మార్గాలన్నిటినీ సమీక్షకుడు పరిశీలించవచ్చు. ముఖ్యంగా సమీక్షకు సంబంధించి ఒకే అంశంపై వచ్చిన రెండు రచనలను పరిశీలించినప్పుడు ఈ తులనాత్మకత ఉపయోగ దృష్టితో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి రెండు రచనల మధ్య సారూప్యతలు లేనప్పుడు తులనాత్మకతకు అవకాశం లేదు. సమీక్షకు ఒక పుస్తకాన్నే ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి తులనాత్మకతకు అవకాశం ఉండదనేది ఒక అభిప్రాయం. కాని పుస్తకాన్ని అందులోని అంశాన్ని చారిత్రకంగా అంచనా వేయడానికి సమీక్షకునికి గతంలో ఇదే సారాంశంతో వచ్చిన మరో పుస్తకాన్ని, లేదా రచయితను, రచనను నిశ్శబ్దంగా ఉంచి పరోక్షంగా పరిశీలించే అవకాశం ఉంది. దీని వల్ల అంశం, రూపం విషయంలో రచయిత స్థానాన్ని నిర్ణయించేందుకు, అతను ఎక్కడున్నాడు అంటే గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు మధ్యలో ఏ దశలో ఉన్నాడనేది నిర్ణయించే అవకాశం దొరుకుతుంది. కాళోజీనాటి పరిస్థితికి, తరువాతి తెలంగాణా ఉద్యమ పరిస్థితికి మధ్య వైరుధ్యాన్ని నిర్ణయించడానికి, శ్రీశ్రీ కాలం నాటి అభ్యుదయ కవితారూపానికి, తరువాతి రూపానికి మధ్య తులనాత్మకంగా గమనించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రెండు రచనలను తులనాత్మకంగా పరిశీలించే తులనాత్మక అధ్యయనానికి, సమీక్షలోని తులనాత్మకతకు బేధం రెండు పుస్తకాలను వాటి వాటి శక్తుల మేరకు పరిశీలించడం, ఒక పుస్తకం చారిత్రక పరిణామశీలతను అంచనా వేయడానికి, మరో పుస్తకాన్ని కేంద్రంగా పెట్టుకోవడంలో ఉంటుంది.
చివరి అంశం నిర్ధారణ. నిజానికి నిర్ధారణపై రెండింటి ఆధారంగా చేసే నిర్ణయం. ఇది సాహిత్యానికి ఏమిస్తుంది. ఏ చేర్పును చేస్తుంది. ఈ రచన ఇస్తున్న సమాచారం ఎటువంటిది. దీనిలోని పరిణామాత్మకత, వాస్తవికత ఎంత? దీనిని ఏ తరహా సాహిత్యంగా గుర్తించాలి. దీని బలాలేంటి? లేదా బలహీనతలేంటి. వ్యతిరేకించవలసిన అంశాలేమున్నాయి. రచన సమగ్రంగా ఉందా ఖాళీలేమున్నాయి లాంటి వాటిని నిర్ధారించడం. దీనిద్వారా రచన విలువ బయటికొస్తుంది. వీటన్నిటినీ గమనించడానికి అధ్యయనంతో పాటు, సంక్షిప్తంగా చెప్పడం సందేహాలు లేకుండా సమాచారాన్ని, నిర్ణయాన్ని ప్రకటించడం అకడమిక్ సమీక్ష చేస్తుంది.
ఇవి సమీక్షలో కనిపించే రెండు ప్రధాన రూపాలు. నిజానికి అకడమిక్ సమీక్ష రాసేవారు ఆయా అంశాలలో చాలా కృషి చేసిన వారై ఉంటారు. వారి అధ్యయనాంశానికి దగ్గరగా రచనలోని విలువలను అంచనా వేస్తారు. ఒక రచనలో భిన్న విలువలను కూడా సమీక్షకులు నిర్ధారించవచ్చు. గతంలో సృజనలాంటి పత్రికలు ఒక పుస్తకంపై రెండు, మూడు సమీక్షలు రాయించేవని పరిశీలకుల మాట. అందువల్ల అనేక విలువలను నిర్ధారించడం ద్వారా రచనా శక్తిని, ప్రయోజనాన్ని సమీక్షలు చెప్పేవి.
సమీక్షకు సంబంధించి అనేక విషయాలు చర్చించుకోవాల్సి ఉన్నా ఇవి ప్రాథమికమైనవి. వీటినుంచి పైన చర్చించిన ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కుని అనుసరించగలిగితే మంచి సమీక్షలు పాఠకలోకానికి అందుతాయి. సాహిత్యంలోని మంచీ చెడు, బలం బలహీనత చర్చకొస్తాయి. ఈ మార్గంలో చర్చ జరగాల్సి ఉంది.
- ఎం.నారాయణశర్మ,
9848348502