Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్న ఊరులోంచి
అందని ఆకాశంలోకి మోసుకుపోయే విహంగం
రెండు దిశల నుండి
ప్రవహిస్తూ వచ్చి
రెండు భావ నదుల సంగమం
ఉంచిన చోటే ఉంచకుండా
ఊహాంచలాల
నూతన ప్రదేశాలకు
లాక్కుపోయే వింతబండి
దు:ఖంలోంచి
ఆనంద పారవశ్యాల్లోకి
సమస్యల్లోంచి సమాధానాల్లోకి
నడిపించుకుపోయే
రంగుల వాహనం
రెండు కలవని అంచుల్ని
రెండు కలవలేని ధ్రువాల్ని
అక్షర ప్రతిభతో కలుపుతూ
వెంట తీసికెళ్ళే
ఒక అందాల శకటం
అది ఒక జ్ఞాపకాల దొంతర, ఒక సంజీవని
రెండు హృదయాల్ని
కలిపే ప్రాణవాహిని
ఉత్తరం ప్రమాదాల్ని తెస్తుంది
ప్రమోదాల్నీ మోసుకొస్తుంది
ఉత్తరం ఉద్యోగాల్ని తెస్తుంది
ఉద్వేగాల్నీ తెస్తుంది
ఎండిన కళ్ళకి కాంతిధార
చితికిన బతుకులకు ఊతకర్ర
ఇది దేశాల గోడల్లోంచి దూసుకుపోతుంది
దిశల తెరల్ని చీల్చుకుపోతుంది
సైనికుడి కళ్ళల్లో
వెలుగుల్ని నింపుతుంది
ఏ ఉత్తరం కన్నీటిని మోసుకొస్తుందో!
పులకింతల్ని తీసుకొస్తుందో! ఎవరికి తెలుసు
అది మనుష్యులను
భావాలతో కదిలించి
ప్రాణవాయువై
కోటాను కోట్ల
మనస్సుల మీదుగా
నిరంతరం పయనిస్తుంది.
- ఎవిఆర్ మూర్తి,
9652488342