Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరిని నేను! ఎక్కడినుండి వచ్చానో
పుట్టిన తారీఖ్ కావాలా తాత ప్రస్థానం చెప్పాలా తండ్రి ఇతిహాసం విప్పాలా
అయితే వినండి -
హరప్పా మొహంజొదారో మూలవాసిని
సింధు గంగా యమునా జలాన్ని తాగినవాన్ని
ఆయా నదీమతల్లుల ఒడిలోనో - ఒడ్డున్నో ఆడినోన్ని
మధ్య ఆసియా నుండి వలసలొచ్చిన
హూణులతో తురుష్కులతో పోరాడినోన్ని
చేతులతో కత్తులతో కట్టెలతో యుద్ధం చేసినోన్ని
నాదిర్షా తుగ్లక్ మహమ్మద్ ఘోరీ ఇబ్రహీం లోడి
కాఫర్ మాలిక్ నరహంతకులెందరో -
నా నేలతల్లిని కబళించాలని చూసినప్పుడు
కాసేపోసి కాలు దిద్దినోన్ని కదన రంగానికి కదిలినోన్ని
ఘీంకార నాదం చేసినోన్ని
అలెగ్జాండరుని సైతం -
తరిమి తరిమి కొట్టినోన్ని
నా దేశ చాయల నుండి తన్ని తరిమేసినోన్ని
నేను ఆర్యుడినో ద్రావిడుడినో వర్ణ సంకరినో
ఇలాతలంపై ఎవరెవరి బంధువునో
ఈ నేల మట్టి నడుగు చెట్టు నడుగు
గుట్ట నడుగు పిట్ట నడుగు చెబుతాయి
తరాల కిందటే కొందరి దాయాదులతో పడక
అగస్త్య ముని వాటిక దాటి వింధ్యాచలాన్ని దాటి
దక్కన్ పీఠభూమిలో గూడు కట్టాడు ముత్తాత
ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి -
కృష్ణగోదావరి కావేరి పెన్నా ప్రాణహితలలో
వేల ఏండ్లుగా కరువులో కాటకంలో
వెలుగులో వేకువలో భాగమైనోన్ని
నీ తండ్రి పుట్టిందెక్కడ తాత పుట్టినదెక్కడ అంటే -
నే పుట్టక ముందే గతించిన తండ్రి తాతల ప్రస్తావన ఎలా చెప్పను
నా తండ్రి దుక్కి చేసిన భూమిలో నాగేటి చాల్లల్లో పాద ముద్రలున్నాయి
అమ్మ మునుం పట్టి కలుపు తీసిన కొండ్రల్లో కొండల్లో కోనల్లో జ్ఞాపకాల పూలు
మా ఊరంతా ఈ నేలంతా
చరిత్రకెక్కని భూమి పుత్రులే
తరతరాలుగా నాగలికే శిలువ వేయబడిన రైతు కూలి మిత్రులే
డెబ్బది ఏళ్ళతరబడి ఓట్లు ఏస్తూనే ఉన్నాం
నా పుట్టుకకి సూర్య చంద్రులే సాక్షి
నా తండ్రి తాత పుట్టుకకి గిట్టుకకి -
బండలతో బంక మట్టితో కట్టిన ఘోరీల సమాధులే సాక్షి
తవ్వినకొద్దీ బయటకొస్తాయి
ఎముకల గూళ్ళు - పౌరసత్వం ఆనవాళ్ళు
- గులాబీల మల్లారెడ్డి,
9440041351