Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ భూమ్మీద మనుషులు జీవిస్తున్నారు
పశుపక్ష్యాదులు, చెట్టూ చేమా
కలగలిసిన ఒక పండుగ
ఇప్పుడు మనుషులెవరని ప్రశ్న
ఇప్పుడు ఉనికి ఏమిటని ప్రశ్న
ఇప్పుడు నువ్వెవరని, నేనెవరని ప్రశ్న
కాలి కింది నేల గురించి ఆరా
నోటికాడి ముద్ద గురించి అనుమానం
జన్మనిచ్చిన నేల గురించి, పుటకనిచ్చిన గర్భం గురించి,
కలిసి బతికిన మనుషుల గురించి అనుమానం
ఎటు చూసినా భయం -
ఎక్కడ నిలబడ్డా హద్దులు
మనిషిని ప్రశ్నగా మిగిల్చి
మనిషిని అతలాకుతలం చేసి
కంచెలు కట్టి, ఆంక్షలు విధించి, ఉచ్చులు బిగించి
ఊపిరాడనీయని రాజకీయ వ్యూహం
వందల ఏళ్ళ అనుబంధం నాది
ఈ పేరుతో నా సంభాషణ ఈ నేలంత పాతది
ఈ ప్రకృతిలో నేనూ ఒక భాగం
ఈ గాలి గుసగుసల్లో, ఈ చెట్టూ చేమా పచ్చదనంలో
ఈ ఆకాశపు ఆత్మీయులతో నేనూ ఓ భాగం
అయినా! ఇప్పుడు నా ఈ కాలి అడుగులు
ప్రశ్నార్థకంగా మారాయి
నా మాట ప్రశ్నార్థకంగా మారింది
'నేనెవర్ని?' అనే ప్రశ్న, నేను నేను కాదనే అనుమానం -
నా పేరు నాది కాదని అదిలింపు -
నా పౌరసత్వం క్వశ్చన్ మార్క్?
నేను నేను కాదా? మరి, ఇన్నాళ్ళ నేనేమిటి?
మనిషిని మనిషిగా గుర్తించని
ఈ లోకపు పోకడ ఏమిటి?
సరిహద్దులు నిర్మిస్తున్న ఈ మనుషుల
అసలు అంతరంగ మేమిటి?
ఇన్ని ప్రశ్నల మధ్య - అనుమానాల మధ్య ఒకే ఒక్క జవాబు-
నేను మనిషిని నేను ఆకాశాన్ని
నేను ఇక్కడ గలగల పారుతున్న సెలయేరును
నా ఉనికి ఇదే
నేనే ఈ భూమిని, ఇక్కడి భూమిని
- శిలాలోలిత,
9391338676