Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత బిఎస్ రాములు తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించే 'పరిణత వాణి' లో చేసిన ప్రసంగాన్ని 'ఒక సృష్టికర్త ఆత్మ చింతన' పేరిట పుస్తకంగా తెచ్చారు. ఇందులో రెండు ఉపోద్ఘాతాలు, మరో రెండు అనుబంధాలు కూడా జతగా వున్నాయి. చివరగా ఆయన చాలా పుస్తకాల్లో వుండే స్వీయ జీవిత విశేషాలు, రచనల వివరాలున్నాయి. వీటికి తోడు 54 పేజీల్లో రచయిత వివిధ సందర్భాల్లో, కార్యక్రమాల్లో తీసుకున్న ఫొటోలూ వున్నాయి. ఈ ఫొటోలను తిరగేయడం ద్వారా రచయిత బిఎస్ రాములు జీవన క్రమం చిత్రాల రూపంలో అవగతమవుతుంది. విద్యార్థి దశలో, బాల్య మిత్రులతో, కుటుంబ సభ్యులతో, రచయితగా వివిధ పురస్కారాలు అందుకున్నవి, తన సంస్థల ద్వారా రచయితలను సత్కరించినవి, బిసి కమిషన్ చైర్మన్ హౌదాలో విధుల నిర్వహణలో తీసిన ఫొటోలు పుస్తకంలో ఇచ్చిన సమాచారానికి చేదోడుగా వున్నాయి.
బిఎస్ రాములు జీవితం ఎన్ని మలుపులు తిరిగిందీ, సాధారణ చేనేత కుటుంబంలో జన్మించి రచయితగా, ఉద్యమ కారునిగా, రాష్ట్రస్థాయి హౌదాను అలంకరించిన వ్యక్తిగా ఎలా ఎదిగిందీ ఈ ప్రసంగ వ్యాసంలో వివరంగా వుంది. ఆయనను తన జీవనక్రమంలో వివిధ వయోదశలలో ప్రభావితం చేసిన అంశాలు, భావజాలాలు, కుటుంబ పరిస్థితుల ద్వారా తన రచనలపై వాటి ముద్ర ఎలా పడిందో సోదాహరణంగా వివరించారు. తాను రాసిన కథలకు, నవలలకు మూల దినుసు ఎక్కడి నుంచి సేకరించారో; వాటిని వాస్తవిక విషాదాంతాలుగా కాకుండా అశావహ ఆదర్శాలతో ఎలా, ఎందుకు ముగించారో; వాటి వెనుక వున్న సామాజిక ఆవశ్యకత, తాత్వికతను రచనల వారీగా మన ముందుంచారు.
పదిహేనవ ఏట మొదలైన రచనా వ్యాసంగం ఏడు పదులు దాటుతున్న వయసులో కూడా నిర్విరామంగా కొనసాగటం ఒక విశేషమే. సుమారు 200 కథలు, 6 నవలలు, 150 సిద్ధాంత వ్యాసాలు, 150 సాహిత్య వాసాలు, మూడు అలంకార శాస్త్ర గ్రంథాలు రాసినట్లు ఇందులో పేర్కొన్నారు. సుదీర్ఘ కాల రచనతో సుమారు వంద పుస్తకాల విడుదలతో తెలుగులో ఆయన సరసన నిలబడే వారిని వెతుక్కోవలసిందే. అయినా ఇప్పటికి తను రాసింది ఐదు నుంచి పది శాతమే. ఇంకా 90 నుండి 95 శాతం తనలోనే వుండిపోయింది అని రచయిత రాసుకోవడం అబ్బుర పరుస్తుంది.
'1990 దాకా సమాజం వెంట నేను నడిచాను. 1990 నుండి నా వెంట సమాజం నడిచింది' అనే స్వీయ ప్రకటనకు జనామోదం కూడా అవసరం.
'దళిత, స్త్రీవాద, వర్గ దృక్పథాలు పరస్పర పూరకాలు, వీటి మధ్య సమన్వయం కుదరడమే సమగ్ర సామాజిక దృక్పథం'. అదే తాత్విక విశ్లేషణ తన రచనలకు మూలమని రచయిత ఒకే వాక్యంలో తన వైఖరిని స్పష్టం చేశారు.
అయితే పుస్తక శీర్షికకు, అందులో వున్న సమాచారానికి పొంతన తక్కువే. సృష్టికర్త, ఆత్మచింతన లాంటి లోతైన పదాలకు తూగని రీతిలో రచన అంతా ఒక రిపోర్టులా సాగింది. మిత్రుల పరిచయాలు, పుస్తకాల వివరాలు ఒకటికి రెండు సార్లు దర్శనమిస్తాయి.
బిఎస్ రాములు సుదీర్ఘ సామాజిక జీవనంలోని ప్రధాన ఘట్టాలను తెలుసుకొనేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. రచయితగా సామాజిక కార్యకర్తగా ఎదగాలనుకునేవారికి ఇందులోని ఎన్నో అంశాలు, చర్చలు స్ఫూర్తిదాయకంగా పనికొస్తాయి.
ఒక సృష్టికర్త ఆత్మచింతన, రచన : బిఎస్ రాములు, పేజీలు : 160, వెల : 80/-, ప్రతులకు : రచయిత, సెల్ : 8331966987.
- బి.నర్సన్,
9440128169