Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దూరాన ఎవరివో దిష్టిబొమ్మలు
నిరసన జ్వాలల్లో తగలబడుతున్నాయి
రోడ్డమీద చిందరవందరగా జనం
వాళ్ళ ముఖాల నిండా కలవరం నదులు
పగబట్టిన విషపుకాలమొకటి
పాదాల నమూనాలు సేకరిస్తున్నది
వివక్షల రంగులు తెలియని పిల్లలు
వెలుగుల తొవ్వల్ని స్వప్నిస్తున్నరు
భయమే బతుకైపోయిన నుదుళ్ళమీద
ఎవరో నెలవంకల ముద్దెర్లేస్తున్నరు
మానవ విలువల విధ్వంసాలకు
ఇంతకు మించిన దాఖలాలుండవు
చిప్పిల్లుతున్న గాయాల సాక్షిగా
కలెగల్సిపోయిన చిరునామాల్ని
ఏ పరికరం వెతికి పట్టుకుంటుంది
అంతా తలకిందుల చితుకులాట
నేలలోంచి పుట్టుకొచ్చే మొలకల్ని
ధ్రువీకరించుకునే రుజువుల కోసం
పులి - మేక జూదమాడుకుంటున్నరు
అంతా ఊహలకందని కుత్సితులాట
గతం బూజులోకి జొరబడుతున్న మనిషి
భవిష్యత్తును సంధించలేని అసమర్ధుడు
అనుమానాల చట్రం ముందు కూర్చుని
సాంస్కృతిక సౌధాల్ని కూలుస్తుంటడు
మానవ పరిమళం వీచే మనుషుల్ని
మళ్ళీ వినిర్మించడమంటే మాటలా...!
విశాల వక్షంలో మునివేళ్ళకు తగిలే
మహాత్ముడంతటి గుండెతడి కావాలి
- పరమాత్మ,
9182342185