Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ వీధుల్లో అమ్మ గర్భం
అమ్మకపు సరుకు అయినంక
దుర్భర పేదరికమే కవచకుండలాలై
వర్ధిల్లుతున్న ఆదివాసి కోనల్లో
యవ్వనమే అభిశాపమై వెక్కిరిస్తోంది
తరుముతున్న పేదరికం
ఉరుముతున్న దరిద్రం
ఫెర్టిలిటీని ప్రోత్సహిస్తున్న వైద్య గణం
వెరసి దహనం అవుతున్న యవ్వనం
పెళ్లి లేకుండానే తల్లులు అవుతున్న దైన్యం
పైసే ఇరుసుగా రాజ్యమేలే చోట
అవసరం నోటై ఇకిలిస్తే
దోసెడు పైసలకు తమది కాని గర్భాలకు
అద్దెతో ఈడ్చుకొచ్చే బ్రతుకులవి
అకాల మరణాలకు లెక్కేలేదు
ఆరోగ్యంతో అవతరిస్తే విదేశాలకు ఎగుమతి
అనారోగ్యం హత్తుకుంటే మరో కొత్త అనాథ
ఆర్తనాదాల వర్తమానాలతో ఆ కోనలు
పిక్కటిల్లుతున్నాయి దయతలిచే చేతుల కోసం
ఈ సరోగసి ఎవరింట్లో పున్నములు పూయిస్తుందో
ఇందరిని అమావాస్యల పాలు చేస్తుంది
ఈ కన్నె తల్లుల దీనగాథలకు
పరిష్కారం ఎప్పుడో..
ఆ రోజు వస్తుందా....??
- అరుణ కీర్తి పతాక.కరాదుల,
9395147443