Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇపుడు గణిస్తున్నవీ, పరిగణిస్తున్నవీ
రోజువారీగా
నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలు
పాజిటివ్‌ల అంకెలు మరణాల మొత్తాలు
అంతా అంతా అంకిలే అంకెలు
పెరుగుతున్న భయ హేతువులంకెలు
అంకెలు భయపెడుతుంటే
ఆదుకోవాల్సినవి అక్షరాలే మరి!
మంచి మాటలే మందు బిళ్ళలు
ప్రజలనుద్దేశించి ప్రధానియో
తెలంగాణ కరుణామయుడు కేసీఆరో
ప్రసంగిస్తున్నప్పుడు
మాటే మంత్రంలా
ఒక భరోసా పరుచుకుంటుంది
కర్తవ్య ప్రబోధంతో
కట్టుబడి బతుకు నెట్టుకు రాగలమనిపిస్తుంది
ఇంటి బాల్కనీలోంచి
వీధిలోకి తొంగి చూసినపుడు
కనిపించే సఫాయి కార్మికుడూ,
పోలీసు ఉద్యోగీ
దృశ్య మాధ్యమంలో ధైర్యం చెప్పే డాక్టరూ
అందరూ శతకోటి వందనీయులే కనుక
చేయెత్తి దండం పెట్టాలనిపిస్తుంది
ఇల్లు కదలకుండానే నిత్యావసరాలు
నిరాటంకంగా సాగిపోతున్నప్పుడు
కడుక్కుంటున్న చేతులే రక్షణ కవచాలుగా
మోహపు తొడుగులే తుంపరలు రాకని గొడుగులుగా
భౌతిక దూరమే బ్రహ్మాస్త్ర శాస్త్రాలుగా
కనబడని శత్రువు మీద
ప్రతి ఒక్కరూ ఒక సుశిక్షిత సైనికునిగా
కలం కదం తొక్కుతున్నప్పుడు
ఆత్మీయుల, బంధువుల, అయినవాళ్ళ
ఫోన్ పలకరింపులూ, వాట్సాప్ స్టేటస్‌లూ,
వీడియో కాన్ఫరెన్స్‌లూ
బతుకు మీద కాన్ఫిడెన్స్‌ను పెంచుతూనే వుంటాయి
ఇల్లే ఒక గుడిగా ఏకాంతమే ఏకేశ్వరోపాసనగా
శుచీ, శుభ్రతలే పూజాపునస్కారాలుగా
దేహమే దేవాలయమన్నట్లు సంచరిస్తున్నప్పుడు
భయం దేనికి
బతికుంటే బలుసాకు తిని బతకవచ్చనట్లు
ఈ నిర్బంధం కొనసాగినా
కరోనాను కడతేర్చడమే అందరిముందున్న కర్తవ్యం
అందుకు ఒక్కొక్కరూ ఒక్కో సైనికుడై
క్రిమిసంహారమే నేటి కురుక్షేత్రం
అగ్రరాజ్యమైనా, అధోజగత్సహోదర దేహమైనా
వణికిస్తున్న కరోనా పీచమణచడమే
ప్రజావళి క్రమక్రమాగత
చైతన్య ధనుప్పాణులు కావడమే
అదే మన తక్షణ కర్తవ్యం
అంకెలకు భయపడక, అక్షరాలా దీక్షాదక్షతలతో
మానవతా విజయకేతనం ఎగురవేద్దాం
ఇప్పటి ఈ ఉత్పాత చరిత్రకు మంగళాంతపు తెరతీసి
ప్రతి మనిషినీ రక్షించుకుందాం
మానవుడే మహనీయుడని నిరూపిస్తూ
కరోనాకు మరణశాసనం రాద్దాం
మనిషి మనిషిగా
దైవం మానుషరూపేణ అనేదే నిర్ధారిద్దాం
లోకాస్సమస్తా సుఖినోభవంతు అని నినదిద్దాం
విజేతలై నిలుద్దాం
- సుధామ, 98492 97958