Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా పాజిటివ్ ఉందని తెలిసీ
క్వారంటైన్లో ఉండాలని తెలిసీ
పారిపోయి రైళ్ళెక్కి బస్సులెక్కి
వందలు వేల మందిని వైరస్‌కు
ఆహుతి చేసే అతి నిర్లక్ష్యపరులకు
ఏ శిక్ష విధించాలి?
ప్రస్తుత ప్రమాద పరిస్థితిలో
అత్యంత అవసరమైన
మాస్కులు, శానిటైజర్లు దాచేసి
బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ
ప్రజల ప్రాణాలతో ఆడుకునేవారికి
ఏ శిక్ష విధించాలి?
ప్రపంచాన్ని కాటేస్తున్న కరోనాతో
అంతా అతలాకుతలమవుతుంటే
నిజమో అబద్ధమో తెల్సుకోకుండా
వాట్సాప్ మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తూ
జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తే
ఏ శిక్ష విధించాలి?
ప్రమాదస్థితిని చక్కదిద్దేందుకు
లాక్డౌన్ చేసి, కర్ఫ్యూ పెట్టి
ఇళ్ల నుంచి బయటకు రావద్దంటే
పనీపాటాలేక రోడ్ల మీదకు వచ్చే
సామాజిక బాధ్యత లేని పౌరులకు
ఏ శిక్ష విధించాలి?
వైరస్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి
అష్టకష్టాలు పడి వ్యాక్సిన్లు కనుక్కునే
డాక్టర్ల ప్రాణాలకు విలువలేదు
కరోనా వస్తే గొంతు మాత్రమే మంట
స్వార్థ అవినీతి పరుల పనులు చూస్తే
గుండెలు కూడా మండి ఆత్మలు క్షోభిస్తాయి!
- డా|| కందేపి రాణీప్రసాద్, 98661 60378