Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. ప్రపంచమంతా పంచభూతాత్మకం
కరోనానంతర లోకాన్ని ఇప్పుడు
ధైర్యం ఇటుకలతో, భరోసా పిల్లర్లతో
ఆశల గోడలతో కొత్తగా నిర్మించుకోవాలి
ధ్వంస విశ్వాసాల బీడులకు
విచలిత విలువల వక్షాలకు
మళ్లీ నీళ్లు పోస్తున్న సంజీవనీ యోధుల్ని కీర్తించుకోవాలి
వారి పోరాటాన్ని నిత్య పారాయణం చేసుకోవాలి
2. నేలను పసికూనగా తలపోస్తూ
చీపురు దువ్వెనతో తలదువ్వుతూ
మాలిన్యాన్ని చేటల చేతులతో ఎత్తిపోస్తూ
స్వచ్ఛతే గుణంగా, శుభ్రతే ఆభరణంగా
ప్రక్షాళనే ఇంధనంగా
నేలకు నవ్వులు నేర్పే అమ్మలకు
ఈ పారిశుధ్య కార్మిక చెలిమలకు జేజేలు పలుకుదాం !
3. వారు ధన్వంతరి వంశీకులు- సుశతుడి వారసులు
తెల్లకోటు ధరించిన దేవతా రూపాలు
వైరస్లు, వ్యాధులు ఎన్ని వచ్చినా
దేహక్షేత్రంలో యుద్ధ వ్యూహాల్ని రచించే సేనానులు
ఇప్పటిదాకా సూది, గోళీలే వారి శస్త్రాలు
శానిటైజర్, మాస్క్‌లు ఇప్పుడు సరికొత్త అస్త్రాలు
ఆకాశమంత విశాల హదయం
మబ్బులదాకా తరలెళ్లిన ప్రాణాలను సైతం
స్టెతస్కోప్‌తో లాక్కొచ్చే
ఈ దైవత్వానికి పాదాభివందనం చేద్దాం !!
4. వంకర టింకరతనం రోడ్లకే కాదు
మనుష్యుల గుణాలకీ వుంటుంది
చౌరస్తాలో నిలబడి
మన ఆలోచనల గుర్రాలకు క్రమతను నేర్పే
ఖాకీ టీచర్లు వారు
లాఠీలపై పువ్వులను
టోపీలపై చిరునవ్వులను అద్దుకొని
24 గంటలూ రోడ్ల మీదే బతుకుల్ని ఆరేసుకుంటున్న
ఈ పోలీస్‌ల ధీరత్వానికి చప్పట్లు కొడదాం !!
5. కారుణ్యమే కవచంగా
సేవా గుణమే ఆభరణంగా
రోగుల పాలిట తోబుట్టువులై
కరోనా కట్టడిలో సాటిలేని ఎవరెస్టులై
సహనం సంయమనం రెండు కళ్ళుగా
నడయాడే మదర్ థెరిసాలు
ఈ మన నర్సమ్మలకు దండాలు పెడదాం !!
6. నారదుడి మానసపుత్రులన్నాం
కానీ మానవాళి అత్యవసర గాత్రాలు వారు
ఒక్కో పదం ఒక్కో తూటాలా
ఒక్కో వాక్యం ఒక్కో మిస్సైల్ లా
సమాచార చికిత్సతో
మానసిక సన్నద్ధతను అందిస్తూ
దేహం నిండా దేశభక్తిని నింపుకొని అక్షర కవచాలతో
ఈ బయోవార్ ని భయం లేకుండా ఎదుర్కొంటున్న
ఈ జర్నలిస్టులకు నీరాజనాలందిద్దాం !!
7. పంచభూతమయమైన ప్రపంచంలో
నవ మానవ నిర్మాతలు వీరు
నేటి యుద్ధక్షేత్రంలో-
మొదటి వరుసలో నిలుచున్న యోధులు వీరు
వారి సేవలకు నిండు గుండె తో హారతులిద్దాం
ఆ స్ఫూర్తిని నిత్యాగ్ని హౌత్రం చేద్దాం
మానవ మనుగడను మమతతో కొనసాగించుకుందాం -
మానవత్వాన్ని వీరి దైవత్వంతో గెలిపించుకుందాం !!
- శ్రీలక్ష్మి ఐనంపూడి, 99899 28562