Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె యిన్నాళ్లూ ముఖం చాటేసింది
యిప్పుడు నాతోనే సహజీవనం చేస్తోంది
ఉరుకులు పరుగులు పెట్టించి
యిప్పుడు ఉపశమనం కలిగిస్తోంది
స్తంభించిపోయిన నాకు
స్పందించడం నేర్పిస్తోంది
చీకటిని మింగిన వెలుగుకు
ఆహ్వానం పలుకుతూ
కలల కౌగిలిలో బందీ అయిన
మెలకువను కాస్త విడిపించి
ఆకాశతోటలో తూరుపు చెట్టుకు పూసిన
సింధూరపు మందారపు
మనోహర చిత్రాన్ని
నా కంటిపాపపై ముద్రిస్తోంది
చల్లని పిల్లగాలుల పలకరింపును
కిలకిలారావాల కీరవాణిలను
నా మనోఫలకానికి వినిపిస్తూ
ఉషాకిరణాల షవర్ కింద
నన్ను తడిపేస్తోంది
పచ్చని ఒంటికి చిక్కని పూలచీర చుట్టి
పవన స్పర్శకు పరవశించిపోతున్న
మా యింటి ముందరి గన్నేరు సోయగం
విరిసిన పూరేకుల మకరందాన్ని
తుమ్మెదకు కానుకగా యిస్తూ
గుమ్మంముందు నిలిచిన గులాబీల యవ్వనం
పాలమీగడ పూసిన చక్రాల కళ్లతో
గోడమీదుగా కొంటెచూపులు చూసే
పాలమల్లెల స్వచ్ఛదనం
తనివితీరా ఆస్వాదించమంటోంది
వాకిట్లో వాలిన ఊరవిశ్కల జంట
ఊసులు వినిపిస్తోంది
జ్ఞాపకాల చెలిమెను తవ్వి
బాల్యపు మధురానుభూతులను
తోడుకోమంటున్నది
విషపుగింజలు విసురుతున్న
సాంకేతిక యుగంలో
ఈ అపురూప దశ్యాన్ని పదిలపరుచుకుని
అస్థిత్వం అంచులకు
వేలాడుతున్న ఆ జంటకు
నాలుగు బతుకుగింజలు విసిరి
ఆశీర్వదించమంటోంది
యాంత్రికత మూసలో
ఘనీభవించిన నా మనిషితనాన్ని
అనుబంధాల పూతలతో పరిమళింపజేస్తోంది
కుటుంబసంబంధాల విస్మతిలో
దారితప్పిన మానవసంబంధాలను వెతికిపట్టి
మాటలు మర్చిపోయిన యింటికి
మమతల ముచ్చట్లు నేర్పుతోంది
వార్తల పెట్టెలోకి నా కళ్లను విసిరేసి
అంతర్జాలపు లోతుల్లోకి
నా మనసును ముంచేసి
దినపత్రికల పేజీల్లోకి
నా దష్టిని దించేసి
కరోనాశాస్త్రాన్ని కంఠస్థం చేయిస్తోంది
పొద్దంతా పుస్తకాలతో
దాగుడుమూతలాడించి
రాత్రంతా నిద్రను ఆలోచనలకు అప్పగించి
నా మస్తిష్కపు మహాసముద్రంలో
పురుడు పోసుకున్న అక్షర విత్తనాలతో
కాగితం క్షేత్రంపై
సాహితీ సేద్యం చేయిస్తోంది
కాలం నాతో సహజీవనం చేస్తోంది
- ఆడెపు రామ్ నారాయణ
99480 20035