Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబా అని దూడని ఆవు నిమిరినపుడు
ఆ ఆవులో కన్పడుతుంది మా అమ్మ నాకు
అమ్మలక్కలు చెప్పిన మాట
కరువులో అమ్మపాలు ఎండిపోతే నా నోరు పిడచకడుతుందని
పిండిలో నీళ్ళు పోసి కలిపి తాపిందట నాకు
ఆ పిండిలో కన్పడుతుంది మా అమ్మ నాకు
ఎండు పుల్లలు ఏరడానికి అడివికి పోయే
అమ్మ కాళ్ళకి చెప్పులు ఉండనట్టె
అమ్మ లెక్కకి ఆ పుల్లలకయితే కాళ్ళే ఉండవు
ఆ ఎండు కట్టెల్లో కన్పడుతుంది మా అమ్మ నాకు
రోజూ అమ్మ వెనక నాయిన ఎత్తిపొడుపులు
చాలిక చదువు చేతికి కొఱ్ఱు కట్టె ఇవ్వు
చదివి మాస్టరు అవుతాడా ఏమి అన్నప్పుడు
ఆ మాస్టరులో కన్పడుతుంది మా అమ్మ నాకు
తాగి నాయిన కొడ్తుంటే
గడగడలాడుతూ ఎగబోస్తున్న అమ్మ
కసాయికి ఇవ్వడానికి కట్టేసిన ఆవులా అన్పించినపుడు
ఆ ఆవులో కన్పడుతుంది మా అమ్మ నాకు
మాటమాటల్లో కళ్ళల్ల నీళ్ళు బెట్టుకొని
ఆడిగింది ఒకసారి
నీవెప్పుడురా చిట్టడివిని చూసిందని
అదే కన్నీళ్ళతో మళ్ళీ అడిగింది
పాలమీది మీగడని చూసావా అని
ఆ మీగడ తరకలో కన్పడుతుంది మా అమ్మ నాకు
అందుకే అనుకుంటాను నీ ఒడి ఆనందాలతో నింపాలని
మళ్ళీ ఓ సారి నీ కడుపునే పుట్టాలని
నీ మమతని నీ పాదాల ముందే ఉంచి కాళ్ళు మొక్కినప్పుడు
ఆ మట్టికొట్టిన పాదాల్లో సైతం మా అమ్మే కన్పడుతుంది నాకు
- మరాఠీ మూలం : నారాయణ్ సుర్వే
తెలుగు అనువాదం : గూడూరు మనోజ