Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘనీభవించిన భావాలెన్నో మేఘాల ముసురు
పట్టి వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి/
కాలపురుషుడు వికటాట్టహాసం చేస్తూ
ఉక్కుచేతులు అడ్డుపెట్టాడు/
అక్షరాలెన్నో ఉనికి కోసం
దారులు వెతుకుతూ వినువీధుల్లో
రెక్కలు విదిల్చి రెప,రెప లాడుతున్నాయి/
గూళ్ళని చేరుకోడానికి దారివ్వమని
వేడుకుంటున్నాయి /
సిరులపంట పండాల్సిన పోలాల్ల్లో
పలుగులు, పారలు మొలుస్తున్నాయి /
ప్రవహించే నదులన్నీ ఒయాసిస్సులయాయి
నీటిని మింగేసిన తిమింగలాలు
బీటలేసిన సముద్రం మీద ఆనంద తాండవం చేస్తూన్నాయి/
నవనవ లాడే లోకం ఇలా మారిందేం!
ఎక్కడ చూసినా కదిలే శవాలతో
నక్కల ఊళలతో , శునకాల శోకాలతో!
కానీ , సింహాసనాలు మాత్రం కొత్త హంగులతో
శోభిల్లుతున్నాయి /
వాటి మీద మానవరూపంలో
అధికారం, స్వార్ధం, కాఠిన్యం కోరలతో
కూర్చుని నీతుల బుసలు కొడుతున్న వారెవరు?
ఓహౌ! జనమేజయుడి సర్పయాగంలో
దగ్ధం కాని కాలనాగులన్నీ తక్షకుడుతో సహా
మానవరూపాల్లో సంచరిస్తూ,
కార్మికులను, కర్షకులను
రైతులను, పేదలను, మధ్యతరగతి
బడుగు జీవులను కసిగా కాటేసి
కరోనా పేరు చెప్పి కాలాన్ని గుళికలా చేసి
మింగేసాయి కాబోలు/
దాహం తీర్చుకోడానికి రక్తం రుచి మరిగిన
పులుల్లా కష్టజీవుల స్వేదజలాలను
దోసిళ్ళతో పట్టి తాగేస్తున్నారు/
కనుమరుగైన కాలం
పేదవాడి బతుకు పటం మీద
ఒలికిపోయిన రంగుల డబ్బాలా
ఊగుతోంది /
బడుగు జీవుల నెత్తుటి సిరాతో
కొత్త చిత్రం గీయడానికి
మరో పికాసో జన్మిస్తాడా/
రేపటి భారతాన్ని పునర్ లిఖించడానికి
మరో వ్యాసుడు అవతరిస్తాడా!
నిశ్చల ప్రతిమనై నిరీక్షిస్తూ
నిలిచే ఉంటాను...ఆక్రోశం ఆవేశమై, మహా ప్రళయమై
ప్రభంజనమై ఘనీభవించిన భావాలు కరిగి
ప్రవహించే వరకు ...
- అత్తలూరి విజయలక్ష్మి, 9676881080