Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెంపేసిన పువ్వుల్లా దిక్కులు చూస్తున్నరు
విసిరేసిన పండ్లలా మూలుగుతున్నరు
నరికేసిన చెట్లలా కూలబడ్డరు
ఏం దరిద్రమో
పని చేతులను విరిచేసింది
పని బతుకులను కూల్చింది
కల్గినోళ్ల బంగ్లాలల్ల
అంట్లు తోమితేనే పూటగడుస్తది
వాకిండ్లూడ్చి సాంపిచల్లి
కడపపై ముగ్గులేస్తేనే దినమెల్లుతది
నాలుగిండ్లల్ల పాచిపనులు చేస్తేనే
సద్దిదో గిద్దిదో మిగిలిందేదో మూటగట్టుకొస్తే
ఆ పూటెల్తుండే
దరిద్య్రం కంట్ల ముండ్లు మొలువ
మాయరోగానికి జడిసి
ఇండ్లుల్ల పనికి రావొద్దంటున్నరు
సోంతూరికి పోలేరు సొంతపనికి సాయంలేదు
నగరాల్లో పనిలేదు ఉండ కిరాయిలేదు
పిల్లలు రోడ్లను చూస్తున్నరు
ఏ దర్మాత్మడన్న పనికి పిలుస్తరేమోనని రెప్పలను వత్తులుచేసి చూస్తున్నరు
ఇంటిపని,వంటపని
ముసలోల్లను లేవట్టుడు కూసపెట్టుడు
చిన్నపిల్లల ఆలనపాలన
కూరగాయలు తెచ్చుడు బండలుకడుగుడు
బట్టలుతుకుడు చెట్లకు నీళ్లుపట్టుడు
నెలనాడొచ్చిన నాలుగువేలతోనే కాలమెల్లేది
సూర్యుడు పొద్దుపొడుస్తున్నడు
పని పొట్టలు మాడి పోతున్నవి
ఏ అపార్ట్మెంట్ వాళ్లను పలుకరియడంలేదు
ఏ గేటెడ్ కమ్యూనిటీ
పిడికెడు బువ్వపెడ్తలేదు
అన్ని రంగాల పనులు గేట్లెత్తేసినా
బడా బాబులు దర్వాజలు తెరువలే
పని జీవుల తండ్లాట
ఒక్కనాడు జ్వరమొచ్చి పనికోకుంటే
ఎన్ని పోన్లో ఎన్ని తిట్లో ఎంతరందో
పనుండి పోపోతే గిన్నెలు తోమెటోడెవరని కస్సున కసురుకునేటోళ్లు
మూడునెల్లదినమాయే నిర్భాగ్యుల దిక్కు మల్లిచూసిన బాబులే లేరు
కూలిన కొట్టాల గురించి మాట్లాడుదాం
విరిగిన వంతెనలపై నాలుగు అక్షరాలను రాద్దాం
కొట్టుకుపోతున్న మూటలను నిలబెడుదాం
పనికిమాలిన రోగం వల్ల
పనికొచ్చే పనిమనుషులకు పనేలేదు
పసివాడి కళ్ళల్లో ఆకలి మంట
- వనపట్ల సుబ్బయ్య, 9492765358