Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1) నిద్దురరానీ, మెలకువ ఉండని
ఎండిన ఆకులాంటి నా గుండెలో
నీ జ్ఞాపకం తొలకరి వాన
2) నీ చెంత నాకు
పొడెండకు కుసుంటే వచ్చే వెచ్చనైన వేడి
వాన ఎలిసినంక వచ్చే చల్లగాలి
ఒకేసారి వచ్చి చక్కిలిగింతలు చేస్తున్నాయి
3) బర్లకాస్తున్న బండ మనిషి పెదవిమీదా వస్తున్నా కూనిరాగమై
పాలపిట్ట నిలిరెక్కలపై దాగిన స్వేచ్చలా
బాయికాడ వాన పడినప్పుడు
కొట్టం సూరు నుండి జారుతిన వాన చినుకులాగా
స్వచ్ఛమైనది మన ప్రేమ అన్నావు గురుతుందా!
4)నువ్వు అనే నేను
జంట చేతులను ఒక్క మనసుగా చేసుకొని
నాగలి కట్టిన ఒలుపాటి, దపాటిలా పోతుంటే
ప్రేమ, ఇత్తనం సాలుగా మన ఎనుకనే వస్తుందనుకున్న
5) మొన్నటి వరకు ఎందరి మధ్యా ఉన్న కళ్లు మాట్లాడుకునేవి
ఇప్పుడు కన్నీరు ఆటలాడుకుంటుంది.
నాలో పేరుకుపోయిన నీ జ్ఞాపకాన్ని
ఎన్నిసార్లు ఉడ్చాలనుకున్నా
చెరువులో పెరిగే నాచుల రోజు,రోజుకు పెరుగుతూనే ఉంది.
6) మనషులు ఎవరు కనిపించని
నిశ్శద్బానికి బందీనై
గుండెకు నీ చిరునవ్వు ఊడుగు ముల్లులా గుచ్చుకుని
నెత్తురు బదులు నీ జ్ఞాపకాలు రాలుతున్నాయి.
7) ఈ జీవితం నాకు సాయంత్రం అయితే
నీకు ఉదయం కావాలి .
8) పొక్కిలైన నా మనసు
ఊరి చివర బొందపెట్టి
నా కోసం ఒక్క కన్నీటి చుక్క రాల్చొద్దు
నీ కన్నీటి చుక్క బొందపెట్టిన నాలో
బొండు మల్లె చిగురించేలా చేస్తది...
- రాజు పెండ్యాల, 9000745691