Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓట్ల మెట్ల ముందు
ఏదో రకంగా అందరం తలా ఒక చోట
నానేసి ఉంచబడ్డం
కొత్త విత్తనాల తుకం
తలెత్తకుండా కుతికెల దాకా
బొక్కెన్లు బొక్కెనల వాగ్దారలు
వాళ్లకు మొలకలు కావాలట
మడి వెనక మడిని
తడిచేసి పెట్టుకున్నారు
నారు కావాలి
నోరులేని నారు
తలవంచుకుని గొలకలను
నోటికందిచ్చే నారు
ఎవడిమన్నాడు
వరం వెనక వరం
కాళ్ళకింద తోడి
కళ్ళముందు పోస్తున్న కుప్పలు
దిగబడుతున్న దేహం ఎవడిక్కావాలి
సాగనీ యాచనలపర్వం
కచేరీల దగ్గర కాళ్ళదగ్గర
దేబిరింపుల ఊరేగింపులు.
అక్కర కొద్దీ
కోరనివీ కోరకుండానే తగిలించినవీ
గొలుసుకట్టు భరణాల తిరనాళ్ళు
మెడ చుట్టూ నిగనిగల నగలు.
వాళ్లు కోరుకున్నట్టు
నాకోసమేనంటూ
నా చుట్టూ
పసిరిక పాముల కాపలా
విసిరిన వలల వెతుకులాట
వాళ్ల కంచెలూ గుమ్ములూ పదిలెం
చూపుల మీద రంగుల కలలవాన
పది కాలాలూ
కాలాన్ని కుక్కలా కట్టిపడేసే
ఎత్తులూ టక్కుటమారి టెక్కులూ
దానమిచ్చిన కొద్దీ
పెరుగుతున్న బొచ్చె
అడుక్కుంటూ అడుక్కుంటూ
అడుగంటిపోతున్న
నానమ్మకం ముందు
నువ్వెప్పుడూ దాత వే
ధర్మ ప్రభువువే
నేనెప్పుడూ ఓట్ల మెట్ల ముందు
కొత్త బిచ్చగాడినే ..
- వఝల శివకుమార్
9441883210
shivakumarvajjala@gmail.com