Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బహుశా
మునిమాపు వేళ
కలలో కొడుకు కనిపించాడేమో
ఇంటికి తాళం వేసింది
కొడుకును భుజాన వేసుకుని
తిరుగుతున్నట్టున్నది
వాడి గుండె లయ
మళ్ళీ చెవిలో మోగిన ట్టున్నది
వాడి జ్ఞాపకాలు
ఆమెను చుట్టు ముడుతున్నాయి
ఆమె చుక్కల వెంట నడుస్తున్నదా
చుక్కలే ఆమె వెంట నడుస్తున్నాయా
అన్నట్లు ఆ నడక సాగుతున్నది
సూర్యుణ్ణి
కొంగున కట్టుకొని
ఆమె నడుస్తున్నది
గాలిలో అటు, ఇటూ ఊగుతున్న
పతంగిలా కాసేపు
ఈదురు గాలిలో
వొరుగుతున్న పక్షి రెక్కలా
కాసేపు ఆమె
సముద్రపు గాలిలో ఊగే
తెరచాప లాను ఆమె కదులుతున్నది
ఆమె ఆకలి దప్పుల్ని
మరచిపోయింది
చెట్ల కొమ్మలపై నుండి
రాలుతున్న పండుటాకులు
ఆమె కాళ్లకు తగిలి వింత శబ్దాన్ని
చేస్తున్నాయి
ఎక్కడి నుండి
ఎక్కడి దాకా ఈ నడక
నిప్పులపై నడుస్తున్న
భక్తురాలిలా ఆమె నడుస్తున్నది
కళ్ళల్లో ఏ మెరుపు శకలమో
ఆమెను ముందుకు తోస్తున్నది
పంచభూతాలు ఆమె
ఆత్మను కదిలిస్తున్నాయి
ఆకాశమే నేల పై సాగుతున్నట్టు
ఆమె యాత్ర
కొనసాగుతున్నది
ఎండు ఖర్జూరంలా ఆమె
దేహం ముడుతలు పడింది
ఎన్ని జ్ఞాపకాల దొంతరలో అవి
నడిచి నడిచి
ఎడారి లాంటి నగరానికి
చేరుకున్నది
లంగరు ఎక్కడో
తెలియని నావలా తీరం ముందు
కొట్టుకుంటున్నది
ఇంటికి వేసిన తాళం చెవి
దారిలో ఎక్కడో పోగొట్టుకున్నది
- సుంకర రమేశ్, 9492180764